తాట తీయండి, వారిని వదలొద్దు- సీఎం చంద్రబాబు..!!
ప్రజారక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి సీఎం చంద్రబాబు సెల్యూట్ చేసారు. మాతృభూమి రక్షణ, ప్రజారక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించుకునే సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు వృత్తి ఎంతో గొప్పదని అభివర్ణించారు. పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. పోలీసులు సైతం నేరగాళ్లకు వణుకు పుట్టేలా వ్యవహరించాలని నిర్దేశించారు.
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసాగా పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యం. ప్రమాదం జరిగినా... నేరం జరిగినా...ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు చూసినా విధుల్లో ఉండి ప్రజల కోసం సేవ చేసే ఒకే ఒక విభాగం పోలీసు విభాగంగా వివరించారు. దుర్గ గుడి శరన్నవరాత్రులు అయినా....విజయవాడ ఉత్సవ్ అయినా...నిర్వహణలో వీరే కీలకమన్నారు. విఐపిల భద్రత అయినా....సమాజంలో శాంతి భద్రతలు అయినా పోలీసులు ఉంటేనే సాధ్యమని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు...తమ ఇంటి పండుగలను దూరం చేసుకుంటారని వివరించారు. అమరులైన పోలీసుల త్యాగాలను ఇలా స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని..మన బాధ్యతని చెప్పారు.

చంద్రబాబు దిశా నిర్దేశం
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పిన చంద్రబాబు... క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో, నేరాలను ఛేదించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నారు. నాడు ఫ్యాక్షన్ ను నియంత్రించడంలో, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, మత కలహాలను అరికట్ట డంలో, ఎందరో అధికారులు, సిబ్బంది అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్నారు. భద్రతపై నమ్మకం ఉన్నచోటే పెట్టుబడులు వస్తాయని... ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకుతాయని చెప్పారు. ఇటీవల కాలంలో మన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ రక్షణకు భంగం కల్గించే కుట్రలను చేధించిందని గుర్తు చేసారు. ఏపీ పోలీస్ ప్రతిష్టను మరింత పెంచిందన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు సహించవద్దని.. నేరస్తులకు రక్షణ కల్పించకూడదని వ్యాఖ్యానించారు. రప్పా రప్పా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే రౌడీల తాట తీయాలని నిర్దేశించారు.












Click it and Unblock the Notifications
