సీఎం కాన్వాయ్ కోసం బలవంతంగా - ముఖ్యమంత్రి ఆగ్రహం : దౌర్భాగ్యం - చంద్రబాబు..!!
మఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కోసం ఒంగోలులో చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు సంచలనంగా మారింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్త సంచలనంగా మారింది. దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.
ప్రయివేటు వ్యక్త వాహనం సీజ్
పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఒంగోలులో పాత మార్కెట్ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్ కోసం ఆగారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వచ్చి ఆ వాహనంతో పాటుగా డ్రైవర్ ను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
తాము తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదంటూ శ్రీనివాస్ వాపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాలు అని చెబుతూ..ఆ వాహనం తో పాటుగా డ్రైవర్ ను తీసుకొని వెళ్లారనే ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది.

ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్
దీని పైన మీడియాలో కధనాలు రావటంతో సీఎంఓ దీని పైన ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం వాహనాన్ని తీసుకెళ్లాలని డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందింది. ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పైన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, ఈ వ్యవహారం పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కారు స్వాధీనం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

చంద్రబాబు సీరియస్ కామెంట్స్
భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందటూ నిలదీసారు. అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడితే..ఇక, ప్రజలు ఎవరితో చెప్పుకోవాలని దుయ్యబట్టారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలను సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications