ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పై హైదరాబాద్ బేగంబజార్ లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు అయింది. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది.
తెలంగాణ సీనియర్ నేత మల్లురవి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోనియాగాంధీపై అసత్య ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కేసు నమోదు చేయాలని మల్లు రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారు అని జరుగుతున్న చర్చల నేపథ్యంలో తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల కీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తుందని వార్తలు వస్తున్న క్రమంలో వైసిపి నేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మల్లురవి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మల్లు రవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ఆర్ కు సోనియాగాంధీ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానాలను పంపించి మరీ జాడ కోసం వెతికించారని పేర్కొన్నారు.వాతావరణం సరిగా లేకపోవడం వల్ల హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని నారాయణస్వామి గ్రహించాలని హితవు పలికారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మల్లురవి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని హెచ్చరించారు. అవాస్తవాలు మాట్లాడిన నారాయణస్వామి పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు.












Click it and Unblock the Notifications