జోకర్..ఓ బచ్చా: పవన్‌పై షబ్బీర్, పిల్లకాకన్న విక్రమార్క
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే స్థాయి లేదని, పవన్ కళ్యాణ్ లాంటి ఎంతో మంది జోకర్లను చూశామని, అతనో బచ్చా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ లాంటి జోకర్లు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి పోయారని అన్నారు.
129 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమి చేయలేరని తెలిపారు. తాము పవన్ మద్దతు అడగలేదని, ఆయన మద్దతు అవసరంలేదని, అలాంటిది నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ హటావో అంటే ప్రజలు పట్టించుకోరని తెలిపారు. తెలంగాణ కోసం ఎంతో మంది చనిపోయారని, అప్పుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నటునిగా మంచిగా రాణిస్తే బాగుంటుందని, కాంగ్రెస్ కుటుంబంపై ఒక్క వేలు చూపిస్తే అతని వైపు నాలుగేళ్లు చూపిస్తాయని షబ్బీర్ అలీ అన్నారు.

మతి భ్రమించింది, పిల్లకాకి: పవన్‌పై భట్టి
శుక్రవారం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం, హావాభావాలు చూస్తుంటే ఒక నటనలాగే అనిపించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పవన్ కళ్యాన్‌కు మతి భ్రమించిందని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అతనికి లేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పుట్టిన పార్టీపై విమర్శలు చేయడం మంచిది కాదని తెలిపారు.
కాంగ్రెస్ చరిత్ర గురించి ఏమి తెలియకుండా ఆరోపణలు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఆరోపణలు చేసే అర్హత లేదని విక్రమార్క అన్నారు. ‘పిల్లకాకివి.. నువ్వు నీ స్థాయి తెలుసుకో... ఆ తర్వాత మాట్లాడు' అని విక్రమార్క దుయ్యబట్టారు. హటావో అనే డైలాగులు సినిమాలోనే పనికొస్తాయని చెప్పారు. రాజకీయాలంటే సినిమా డైలాగులు కాదని అన్నారు. దయచేసి పరిస్థితిని, చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని పవన్ కు సూచించారు.
సమాజం అంటే సినిమా ప్రపంచం కాదని, అన్ని తెలుసుకుని ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications