చిరు టఫ్: పవన్‌పై దుమ్మెత్తిపోసిన కాంగ్రెసు నేతలు
హైదరాబాద్: జనసేన పార్టీ పెట్టి తమ పార్టీపై విరుచుకుపడిన సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెసు నేతలు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ పట్ల కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. సున్నితంగానే అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్‌ను వ్యతిరేకిస్తూ గట్టిగానే మాట్లాడారు. చిరంజీవి వ్యాఖ్యల తర్వాత కాంగ్రెసు నాయకులు తమ దాడిని పెంచారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ పగటి వేషగాడని నల్లగొండ జిల్లా మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచే విధంగా, యువతను పక్కదారి పట్టించే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం చేశాడని ఆయన శనివారంనాడు అన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు.

ప్రజా వేదికపై సినిమా డైలాగులు చెప్పడం సరికాదని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవన్ కళ్యాన్‌ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్ చిన్న పిల్లాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం వేలాది మంది చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పవన్ పార్టీ ప్రభావం తెలంగాణలో ఉండదని ఉత్తమ్‌కుమార్ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్‌కు వార్డ్‌మెంబర్‌గా కూడా గెలిచే సత్తా లేదని, అలాంటిది కాంగ్రెస్ విమర్శించే స్థాయి ఎక్కడిదని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం పుట్టినప్పుడు పవన్ పుట్టనేలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్‌కు తగదని సారయ్య అభిప్రాయపడ్డారు.
పవన్‌కళ్యాణ్‌కు మత్రిభమించిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. పవన్‌కళ్యాణ్ లాంటి జోకర్లు ఎందరో వచ్చిపోయారని విమర్శించారు. అఖిలపక్ష భేటీలో తెలంగాణ ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆకాశంపై ఉమ్మితే మనపైనే పడుతుందనే విషయాన్ని పవన్ గ్రహించాలన్నారు. 'నేను నీ జోలికి వస్తా...దమ్ముంటే నా జోలి'కి రా అని షబ్బీర్ అలీ సవాల్ చేశారు.
పవన్‌కు సోనియా, రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని మరోనేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పవనో పిల్ల కాకి అని వ్యాఖ్యానించారు. పవన్ సినిమా ప్రభావం నుంచి బయటపడాలని సూచించారు. సామాజిక న్యాయమంటే ఫైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీ పెట్టడం కాదని కేంద్రంమంత్రి బలరాంనాయక్ ఎద్దేవా చేశారు. జనసేప పార్టీ కాదు...ఓ సినిమా అని ఆయన అన్నారు.
సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు నాయకులు కూడా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి సి. రామచంద్రయ్యతోపాటు మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఇలాంటి వాళ్లను కాంగ్రెసు చాలా మందిని చూసిందని వారు అన్నారు. రాజకీయం అంటే సినిమాల్లో నటించినట్లు కాదని వ్యాఖ్యానించారు.
సమాజంపై పవన్ కళ్యాణ్‌కు అవగాహన లేదని మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. మహాత్మా గాంధీ, అబెండ్కర్, బుద్ధుడి వంటివారని పవన్ కళ్యాణ్ స్మరించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications