సనాతన ధర్మంలో విడాకులే లేవుగా ? మరి నువ్వెలా..! పవన్ కు సీపీఐ నారాయణ ప్రశ్న..!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యవర్గ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతీ చోట ప్రవచిస్తున్న సనాతన ధర్మంపై నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు నారాయణ తనదైన శైలిలో చురకలు అంటించారు. దీంతో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పవన్ కళ్యాణ్ తో సహా సనాతన ధర్మాన్ని సమర్దించే వారెవరయినా శిక్షించాలని సీపీఐ నారాయణ ఇవాళ డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం క్రూరమైనదని, అరాచకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు... పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని నారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి గతంలో తానెప్పుడూ మాట్లాడలేదని ఆయన గుర్తుచేశారు. సనాతనధర్మాన్ని పవన్ కళ్యాణ్ నెత్తికెక్కించుకున్నాకే తాను స్పందించానన్నారు.

అరాచకమైన క్రూరమైన సనాతన ధర్మాన్ని పాటించేవారిని పవన్ కళ్యాణ్ తో సహా సమర్థించే ప్రతి ఒక్కరిని శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారని, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలని అన్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత తాను వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమేనని, సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని ప్రశ్నించానన్నారు.

వాచస్పతి శ్రీ గరికపాటి నర్సింహారావు గారెని సనాతన ధర్మం గురించి అడగాలని నారాయణ సూచించారు. సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లయిన తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత వెదవ పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలని, చివరికి భర్త చనిపోతే అదే చితిమంటలో భార్యను కూడా తగలబెడతారనేది దాని సారాంశమని నారాయణ తెలిపారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ విడాకులు ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించేవారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications