ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. సింగపూర్ స్ఫూర్తితో ఎదుగుదాం: పవన్ కళ్యాణ్ ఆకాంక్ష!
ఏపీలో కూటమి పాలనలో పారిశ్రామిక పెట్టుబడులు పెరిగాయి. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే క్రమంలో దృష్టి సారిస్తున్న ఏపీ సర్కార్ పెట్టుబడిదారులను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో తాజాగా కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 16 పరిశ్రమల వర్గాలతో పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పనిలో ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
వైసీపీ హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేది. కంపెనీ పెడితే మాకేమిస్తారని వేధించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేస్తారు అని అడిగే సంప్రదాయం తీసుకొచ్చాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుస్తున్నాం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 714 పరిశ్రమల రూపంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పవన్‌కల్యాణ్ వెల్లడించారు.

వీటిలో రూ.16.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాయి. రూ.4.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశకు చేరుకున్నాయి. దీని వల్ల యువతకు 7.1 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. సదస్సు వేదికగా 16 పరిశ్రమలతో రూ.4,652 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మరో నాలుగు ప్రాజెక్టులకు రూ.2,090 కోట్లతో శంకుస్థాపన జరిగింది. ఇవి కలిపి సుమారు రూ.6,347 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపారు. వీటి ద్వారా 18 వేల మందికి ఉపాధి కలుగుతుందని అధికారులు ప్రకటించారు.
కాకినాడ ప్రాంతంలో ఇప్పటికే 39 ప్రాజెక్టులు రూ.92 వేల కోట్లతో చేపడుతున్నారు. వీటిలో 28కు అనుమతులు వచ్చి 18 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ సింగపూర్ ఉదాహరణను గుర్తు చేశారు. ఒకప్పుడు పేద దేశంగా ఉన్న సింగపూర్ సంకల్పం, సమష్టి కృషితో అద్భుతంగా మారిందని చెప్పారు. రాష్ట్రానికి 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వరం అని, దీనిపై సముద్ర పరిశ్రమలు, షిప్‌బిల్డింగ్, గ్రీన్ హైడ్రోజన్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్‌లో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
అయితే పర్యావరణ రక్షణ కూడా అంతే ముఖ్యమని, గ్రేట్ గ్రీన్‌వాల్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పరిశ్రమలు రావాలని పవన్‌కల్యాణ్ కోరారు. రూ.1.70 లక్షల కోట్లతో రోడ్లు, కాలువలు, అనుసంధాన మార్గాలు నిర్మిస్తున్నామని, పల్లె పండుగ, ఆదివాసీ బాట వంటి పథకాలతో గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications
