వైయస్ సొంతూరుపై బాబు కన్ను: పోటాపోటీ, జగన్ సత్తా చాటేనా?
కడప: వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉన్న కడప జిల్లా పైన తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన కీలక నేతలను సైకిల్ ఎక్కించుకుంటున్నారు. చంద్రబాబు ఏకంగా వైయస్ సొంతూరు బలపనూరు పైనే కన్నేశారు.
బలపనూరు చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఇప్పుడు అభివృద్ధి పరుగు పెడుతోంది. మొన్నటిదాకా బలపనూరును పట్టించుకోని వారు ఇప్పుడు ఆ గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని అంటున్నారు. అన్ని పనులు చకచకా చేసేందుకు ప్రయత్నిస్తూ గ్రామస్తుల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారట.
బలపనూరు వైయస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని సింహాద్రిపురం మండలంలో ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సొంతూరు. బలపనూరు జగన్‌కు కూడా కీలకమైన గ్రామమే. ఎందుకంటే తన సొంతూరు కాబట్టి.

త్వరలో బలపనూరులో గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆది నుంచి వైయస్ కుటుంబం మద్దతిచ్చిన వ్యక్తే ఆ గ్రామానికి సర్పంచ్‌గా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం.. ఇప్పటిదాకా అసలు ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలోకే దిగలేదు.
ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైయస్ గ్రామంలో జెండా ఎగురవేయాలని టిడిపి ఉవ్వీళ్లూరుతోంది. ఇప్పటికే తన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతుండటంతో జగన్ ఇబ్బందుల్లో పడ్డారు. బలపనూరు టిడిపి పరమైతే అది జగన్‌కు మరో పెద్ద షాక్ అవుతుందని చెప్పొచ్చు.
ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు టిడిపి, అటు వైసిపిలు పోటాపోటీగా గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో జగన్ సొంత గ్రామంలో సత్తా చాటుతారా, లేక వైయస్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ జెండా పాతి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications