ఆమె: ఉవ్వెత్తున ఎగసి కిందపడ్డ రాజకీయ కెరటం!!
భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులంటే కర్నూలు జిల్లాలో అందరికీ గౌరవం. ఆ గౌరవాన్ని వారు మరణించేవరకు నిలుపుకుంటూ వచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ వారి కుమార్తెలు, కుమారుడు మాత్రం తల్లిదండ్రుల పేర్లను నిలపలేకపోతున్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణించిన తర్వాత వారికి గైడెన్స్ చేసేవారు లేకపోవడం, తక్కువ వయసులోనే మంత్రి పదవి రావడంతో అఖిలప్రియే అందరికీ పెద్దదిక్కుగా మారారు. కానీ ఆమె భార్గవ్ రామ్ ను వివాహం చేసుకున్న తర్వాత జీవితం మొత్తం వివాదాస్పదంగా మారిపోయింది.

సీటు విషయమై గ్యారంటీ లేదు?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియకు సీటు విషయమై గ్యారంటీ ఇవ్వడంలేదు. కానీ తనకు ఆళ్లగడ్డతోపాటు నంద్యాల సీటు కూడా కావాలని, అక్కడ తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీచేస్తాడని అధిష్టానానికి విన్నవించుకుంది. నారా లోకేష్ పాదయాత్ర 'యువగళం'లో అందరూ పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. చంద్రబాబు సీటు కాదన్నా లోకేష్ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి యువత కోటాలో తనకు సీటు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.

ఉవ్వెత్తున ఎగసి..
ఆమె రాజకీయ జీవితం ఉవ్వెత్తున పైకెగిసి పాతాళానికి పడిపోయింది. రాజకీయ జీవితంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి అందుకోలేని మంత్రి పదవిని చిన్నవయసులోనే ఆమె అందుకున్నారు. కానీ నాలుగు సంవత్సరాల నుంచి అత్యంత వివాదాస్పదమైన రాజకీయవేత్తల్లో ఒకరుగా అఖిలప్రియ నిలిచారు. ఇటీవలే నంద్యాల బ్యాంకు అధికారులు రుణం చెల్లించాలంటూ ఆమె ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీనికితోడు తాజాగా ఆమె సమీప బంధువులే తమ డబ్బులు తమకు చెల్లించాలంటూ అఖిలప్రియ ఇంటి ఎదుటే దర్నాకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత అప్పులకు సంబంధించి అఖిలప్రియ ఎంతకీ స్పందించకపోవడంతోనే తాము ఇలా చేయాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు.

ఇంటిముందు బంధువులే ధర్నా!
భూమా నాగిరెడ్డి అన్న భూమా భాస్కర్ రెడ్డి కుమార్తె మహేశ్వరి, ఆమె భర్త బూచుపల్లి మురళీధర్ రెడ్డి, భూమా ప్రతాప్‌రెడ్డి కుమార్తె రాజీ, ఆమె భర్త, గుంతకల్లుకు చెందిన ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సాయి మహేశ్వరరెడ్డి, భూమా నాగిరెడ్డి చిన్నాన్న కుమారుడు, దొర్నిపాడు మాజీ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఆయన కుమారుడు తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భూమా సంతోష్‌రెడ్డి నిరసనకు దిగినవారిలో ఉన్నారు. ఇప్పటికే సీటివ్వాలా? వద్దా? అన్నట్లుగా పార్టీ ఆలోచిస్తుంటే తాజాగా జరుగుతున్న సంఘటనలు అఖిలప్రియకు మరింత మైనస్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications