మా సముద్రాన్ని కాపాడండి..
బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్యకలాపాల పట్ల స్థానిక మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తమ జీవనాధారమైన సముద్రాన్ని కాపాడాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ మేరకు మా సముద్రాన్ని రిసార్ట్స్ యజమానుల నుంచి, అధికారుల నుంచి కాపాడండి" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా గత నాలుగు రోజులుగా రామాపురం తీరంలో బోటింగ్ సదుపాయాల ఏర్పాటుకు వేగంగా పనులు సాగుతున్నాయి. ఒంగోలుకు చెందిన వ్యక్తి "దివే చీరాల ఎల్‌ఎల్‌పీ" పేరిట బోటింగ్ నిర్వహణకు అనుమతులు పొందినట్లు సమాచారం. స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 19న బోటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా ప్రచారం ఉంది.

అయితే, ఈ పనులు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని మత్స్యకారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హై టైడ్ లైన్ నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్న "నో డెవలప్‌మెంట్ జోన్"లోనే ఇసుక దిబ్బలను భారీ యంత్రాలతో తొలగించడం పర్యావరణానికి ముప్పుగా మారుతుందని వారు చెబుతున్నారు. ఈ ఇసుక దిబ్బలు సముద్ర అలల తీవ్రతను తగ్గించే సహజ రక్షణగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
స్థానిక మత్స్యకారుల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ వల్ల వారి వేట మార్గాలు, పడవల నిల్వ ప్రదేశాలు దెబ్బతింటాయి. జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. "పర్యాటక అభివృద్ధి పేరుతో మమ్మల్ని మా ప్రాంతాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. మేము ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు" అని వారు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో మత్స్యకార సంఘాల నాయకులు కూడా వీరికి మద్దతుగా నిలిచారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్న సమయంలో నిర్వాహకులు భారీ యంత్రాలను వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పర్యావరణ అనుమతులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన క్లియరెన్స్ లేకుండా పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నప్పటికీ, పూర్తి వివరాలు వెల్లడించకపోవడం వివాదానికి దారితీస్తోంది.












Click it and Unblock the Notifications