చంద్రబాబు అరెస్టుకు అసలు కారణమిదే ? మాజీ మంత్రి నారాయణ షాకింగ్..
ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి సీఎం, ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి ఆయన సొంత పార్టీ నేతలు తమదైన శైలిలో భాష్యాలు చెబుతున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఒకప్పటి కేబినెట్ సహచరుడు, మాజీ మంత్రి నారాయణ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేశారని అంతా భావిస్తుండగా.. మాజీ మంత్రి నారాయణ మాత్రం దీని వెనుక అసలు కారణం వేరే ఉందని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆ కారణంతోనే చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపిందని నారాయణ ఇవాళ వెల్లడించారు. అలాగే ప్రభుత్వం తాజాగా మరోసారి తెరపైకి తెస్తున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసుపైనా నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా వెలువడిన జాతీయ మీడియా సర్వేల్లో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రావడం ఖాయమని తేలడంతోనే సీఎం జగన్ కుట్ర పన్ని చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నారాయణ వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు వెనుక అసలు కారణం ఇదేనన్నారు. చంద్రబాబు సభలకు భారీ ఎత్తున జనం రావడంతోనే వైసీపీ ఓడిపోవడం ఖాయమని తేలిపోయిందని నారాయణ పేర్కొన్నారు. అందుకే జగన్ ఓటమి భయంతోనే జగన్ అక్రమ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపారన్నారు.
చంద్రబాబు బెయిల్ పై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నారాయణ తెలిపారు. చంద్రబాబుకు త్వరలోనే బెయిల్ వస్తుందన్నారు. మరోవైపు ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెస్తున్న అమరావతి రింగ్ రోడ్డు కేసుపై నారాయణ సెటైర్లు వేశారు. అక్కడ రింగు లేదు, రోడ్డు లేదన్నారు. ఆ రింగురోడ్డులో తన సొంత స్థలమే పోయిందన్నారు. అప్పట్లో తాము కావాలని అనుకుంటే రోడ్డును పక్కకి జరిపేవాళ్లం కాదా అని నారాయణ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications