అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ..!!
Ambati Rambabu: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. అందులో పోస్ట్ అవుతున్న సమాచారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో పాటు ఓ యూట్యూబ్ ఛానల్‌పైనా గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు, సీమరాజా అనే పేరుతో యూట్యూబ్‌లో అసభ్య పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి జగన్‌పై చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని అంబటి రాంబాబు అన్నారు. వాటిని విలేకరులతో చూపించారు. యూట్యూబ్‌లో సీమరాజా అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకుని పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు.
ఇలాంటివి అసంబద్ధ, అసత్య ప్రచారాలు చేస్తే తమ మనోభావాలు దెబ్బ తినవా?, చంద్రబాబును విమర్శిస్తే మాత్రం వారి మనోభావాలు దెబ్బతింటాయా? అంటూ ప్రశ్నించారు. రెండేళ్ల కిందట పెట్టిన పోస్టులను చూపించి తమ కార్యకర్తలను అరెస్ట్ చేస్తోన్నారని, నెల రోజులుగా జైల్లో నిర్బంధించారని చెప్పారు.
ఈ సీమరాజా తన మీద మాత్రమే కాకుండా పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన సతీమణిని ఉద్దేశించి దుష్ప్రచారం చేస్తూ చేసిన వీడియోలు ఉన్నాయని, ఇలాంటివి మానుకోవాలంటూ తాను ఇప్పటికే చెప్పానని అన్నారు. వాటిని ఆపకపోగా లోకేశ్ ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయి దూషిస్తున్నాడని చెప్పారు.
అతనిపై పోలీసులు చర్యలు తీసుకునే వరకు పోరాడతామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో తమ పార్టీపై చేస్తోన్న దుష్ప్రచారం, మార్ఫింగ్‌పై కిందటి నెల 17, 18, 19 తేదీల్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామని, ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదని అన్నారు.
తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారో లేదో కూడా తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కాలయాపన చేయడం సరికాదని అంబటి అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించకుండా నిష్పక్షపాతంగా పని చేయాలని అంబటి రాంబాబు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications