టైలర్ కొడాలి నాని..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నమ్మకం నువ్వే జగన్.. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ప్రతి ఇంటినీ పలకరిస్తోంది. లబ్దిదారులను ముఖాముఖిగా కలుసుకుంటోంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ఆరా తీస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు.. ఇందులో విస్తృతంగా పాల్గొంటోన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికిస్తోన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేస్తోన్నారు. ప్రభుత్వంపై వారిలో నెలకొన్న అభిప్రాయాలను సేకరిస్తోన్నారు.

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలో జరిగిన మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు కొడాలి నాని పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులను పలకరించారు. వలంటీర్లు, అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించాలంటూ అప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తోన్నారాయన.

ఈ క్రమంలో- కొడాలి నాని టైలర్ అవతారం ఎత్తారు. ఆయన అభిమానులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. ఓ షాప్ ముందు ఉన్న టైలరింగ్ మిషన్ వద్ద కూర్చుని, యూరియా సంచిని చకచకా కుట్టేశారు. గతంలో ఆయన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌గా కనిపించిన విషయం తెలిసిందే. గుడివాడలో కొత్తగా ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన అనంతరం ఆయన అందులో ఒకదాన్ని సరదాగా నడిపారు. సిటీలో చక్కర్లు కొట్టారు.
ఇప్పుడు తాజాగా టైలర్ అవతారం ఎత్తారాయన. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు కొడాలి నాని. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడ గ్యారంటీ అని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ స్పష్టం చేశారు. యువగళం పేరుతో నారా లోకేష్ కొనసాగిస్తోన్న పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటిన నేపథ్యంలో దాని గురించీ మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ విజయానికి పెద్దగా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. గుడివాడలో తనను ఓడించడానికి చంద్రబాబు, నారా లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించబోవని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, ఆయన నాయకత్వంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications