PALNADU: పరువు పోరుకు పల్నాడు సిద్ధం! 1991 నాటి భయానక చరిత్ర గుర్తుకొస్తున్న వేళ..
పౌరుషాల పురిటి గడ్డ పల్నాడు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన హింసాకాండ దేశం మొత్తాన్ని పల్నాడు వైపు చూసేలా చేసింది. మాచర్లలో ఈవీఎంలు పగలడం, నరసరావుపేటలో తలలు పగలడం, పెట్రోల్ బాంబులు పేలడం వంటి ఘటనలతో రెండు తెలుగు రాష్ట్రాలు సైతం హడలిపోయాయి. సినిమాల్లో చూసే ఫ్యాక్షన్ కళ్ల ముందు కదలడం, ఇళ్లపై రాళ్ల దాడి, తలలు పగిలే దృశ్యాలు చూసిన.. అధికారులు సైతం " ఆ రోజు ఇంటికి క్షేమంగా చేరితే చాలు దేవుడా" అని మొక్కుకున్న పరిస్థితులు ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు.
ఎన్నికల అనంతర హింస.. ఖాళీ అవుతున్న గ్రామాలు!
ఎన్నికల తర్వాత జిల్లాలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీస్ శాఖ హై ప్రయారిటీ ఇస్తూ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లా ఎస్పీగా లేడీ సింగం మల్లికా గార్గ్‌ను రంగంలోకి దించి కొంతమేర శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. అయితే, గత రెండేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలు, పలు హత్యలు మళ్లీ గ్రామాలను వణికిస్తున్నాయి. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని గ్రామాలు ఖాళీ అయితే, 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మరికొన్ని గ్రామాలు ఖాళీ అయ్యే దుస్థితి తలెత్తింది. పండక్కో పబ్బానికో ఊరికి వచ్చిన వారు శవాలై కనిపిస్తున్న వైనం స్థానికులకు చమటలు పట్టిస్తోంది. ఇంతటి సున్నిత వాతావరణం నడుమ స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగడంతో, గ్రామాల్లో ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

పరువు పోరుగా స్థానిక సంస్థల ఎన్నికలు.. పోలీస్ శాఖకు సవాల్!
ప్రస్తుతం జిల్లాలో కూటమి ఆధిపత్యం నడుస్తున్నప్పటికీ, గ్రామస్థాయిలో వైఎస్సార్‌సీపీ నేతలు కూడా ఢీ అంటే ఢీ అంటున్న వేళ.. ఈ ఎన్నికలు ఎలాంటి ఘర్షణలకు దారితీస్తాయనే భయం అందరిలోనూ ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అహం దెబ్బతీసే ప్రతిష్టాత్మక అంశం కాగా, పోలీస్ శాఖకు మాత్రం అగ్నిపరీక్షలా మారింది. జిల్లాలో గొడవలు జరగకుండా, గ్రామాల్లో రక్తం చిందకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరిగే పరిస్థితి ఈ రోజుకు ఉందంటే అతిశయోక్తి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యంత్రాంగం వ్యూహాలు.. కవాతులు, శాంతి కమిటీలు!
2024 నాటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్ రాకముందే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాచర్ల, గురజాల, వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెద్దకూరపాడు నియోజకవర్గాల్లో ముమ్మరంగా కవాతులు నిర్వహించారు. అన్ని గ్రామాల్లో కార్డన్ సెర్చ్‌లు చేపట్టి ఇళ్లలో ఎలాంటి అక్రమ ఆయుధాలు లేకుండా స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సమస్యాత్మకమైన, సమస్యాత్మకమైన 337 పంచాయతీల్లో ఈ నెల 18వ తేదీలోపు శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా కఠిన ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ బాస్‌ల మార్పు.. కొత్త ఎస్పీ స్పీడ్!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో పోలీస్ బాస్‌లు వెంటవెంటనే మారిపోవడం ఇక్కడి రాజకీయ తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నికల వేళ ఎస్పీగా బిందు మాధవ్ వ్యవహరించగా, ఆ తర్వాత మల్లికా గార్గ్, కంచి శ్రీనివాసరావు, కృష్ణ రావు, ఇన్ ఛార్జ్ ఎస్పీగా రోహిత్ కుమార చౌదరి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జగదీశ్ అదహళ్లి జిల్లాలోని అన్ని స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. తన మార్క్ పోలీసింగ్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పట్టుదలతో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నాటి చరిత్ర చెబుతున్న పాఠాలు..
ఏపీ మాజీ సీఎస్ పూనం మాలకొండయ్య ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో తన సర్వీస్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో గుంటూరులో జేసీగా పనిచేసిన సమయంలో నరసరావుపేట పార్లమెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద వైలెంట్ సెగ్మెంట్‌గా ఉండేదని ఆమె పేర్కొన్నారు. 1991 ఎన్నికల సమయంలో బాంబ్ కల్చర్ పీక్స్‌లో ఉండేదని, ఆనాడు జాయింట్ కలెక్టర్ కాల్పులు జరిపిన ఘటనను, అంతకుముందు మరో జాయింట్ కలెక్టర్‌ను మహిళలు చెట్టుకు కట్టేసి కళ్లలో కారం చల్లిన భయానక ఉదంతాలను ఆమె గుర్తుచేశారు. పోలింగ్ బస్సును తగలబెట్టిన పరిస్థితుల్లో, ఆ ఎన్నికలను హ్యాండిల్ చేయగలరా అని కలెక్టర్ తనను అడిగారని, అయితే పకడ్బందీ చర్యలతో ఆ ఎన్నికలను నరసరావుపేట చరిత్రలోనే అత్యంత ప్రశాంతంగా, భారీ పోలింగ్‌తో నిర్వహించినట్లు ఆమె వివరించారు.
1991 నాటి నీడలు.. మహిళా అధికారుల ముందున్న అగ్నిపరీక్ష!
నాటి భయానక పరిస్థితులు మరోసారి పల్నాడులో కళ్లముందు కదులుతున్న తరుణంలో.. మహిళా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా సమర్థంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పల్నాడులో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల నిర్వహణపైనే తమ దృష్టిని కేంద్రీకరించారు.














Click it and Unblock the Notifications
