పల్లె బాట పట్టిన నగరం - ఈ రూట్ లో వెళ్లే వారికి బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. హైదరాబాద్ నగరం లో ప్రధాన వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. హైదరాబాదీలు భాగ్యనగరం నుంచి సొంత ఊర్ల బాట పట్టారు. టోల్ ప్లాజాలా వద్ద భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. జాతీయ రహదారుల పై పండుగకు సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. ఇదే సమయంలో ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కీలక సూచనలు చేసారు.
పల్లె బాట పట్టిన నగరం
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అయింది. సొంత ఊర్లకు వెళ్లే వారితో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్లాయి.

సొంత ఊర్లకు పయనం
తెలంగాణ ప్రజలు కూడా హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ కూడా కిటకిటలాడుతోంది. ఒక్క రోజులోనే దాదాపు70 వేలకు పైగా వాహనాలు సొంతూళ్ల కు వెళ్లారు. పంతంగి టోల్‌ప్లాజ్ వద్ద మొత్తం 16 బూతులకు గాను పది బూతులు ఏపీ వైపుకు, 6 బూతులను హైదరాబాద్ వైపు తెరచి ఉంచారు. అలాగే నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద ఉన్న 12 బూతులలో ఏడు ఏపీ వైపు, ఐదు హైదరాబాద్ వైపు తెరిచారు. ప్రయాణాలు చేసే వేళ అధికారులు అలర్ట్ జారీ చేసారు. రోడ్లు విస్తరణ జరుగుతున్న వేళ ముందస్తు జాగ్రత్తలతో వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. దండిమల్కపురం వరకు ఆరులైన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి.
ఈ మార్గాల్లో బీ అలర్ట్
మల్కాపురం నుంచి ఏపీ నందిగామ వరకు 17 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని ఎన్‌హెచ్‌ఏ అధికారులు సూచిస్తు న్నారు. టోల్‌ప్లాజా వద్ద మూడు సెకన్ల కంటే ఎక్కువగా వాహనాలు నిలిచిపోకుండా టోల్‌ప్లాజా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫాస్టాగ్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హ్యాండ్ మిషన్ గన్‌లను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్‌ప్లాజ్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా సెలవులు పూర్తయిన తరువాత తిరుగు ప్రయాణాల కోసం ఆర్టీసీ, రైల్వే అదనపు సర్వీసులు అందుబాటు లోకి తీసుకొచ్చాయి.












Click it and Unblock the Notifications