మరో అల్పపీడనం - ఈ జిల్లాల్లో ఇక కుంభవృష్టి, తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో సారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. గత వారం ఒక్క సారిగా వేడి పెరిగింది. ఉక్కపోత తో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరోసారి వర్షాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు తిరుపతి, ఏలూరు, నంద్యాల, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, గుంటూరు మొదలైన పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా చిల్లకూరులో 11.2 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లా చింతలపూడిలో 10.7, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 10.5, అనంతపురం జిల్లా గుత్తిలో 9.9, కర్నూలు జిల్లా గూడూరులో 9.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం నంద్యాల, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

తెలంగాణలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 12) తెలంగాణ లోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications