వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా చాణక్యం: చంద్రబాబుకు చిక్కులు, కెసిఆర్‌కు షాక్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చిన విందులో చోటుచేసుకున్న అంశాలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెంపొందించాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రంపై పలు దఫాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.

కేంద్రం కూడా తదనుగుణంగానే ప్రతిస్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఏపీ పునరవ్యవస్థీకరణ చట్టంలో ఏపీలో రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225కి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలను 153కు పెంచేలా పొందుపరిచిన సంగతి తెలిసిందే.

కానీ ఈ విషయమై కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తోంది. ప్రత్యేకించి తెలంగాణలో పట్టు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. అందునా ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో చాణక్య నీతి ప్రదర్శిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల ఆశలకు అడ్డుకట్ట వేశారని తెలుస్తున్నది.

అసెంబ్లీ స్థానాలు పెంపును అడ్డుకున్న బీజేపీ

అసెంబ్లీ స్థానాలు పెంపును అడ్డుకున్న బీజేపీ

అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలంగాణ సీఎం కేసీఆర్.. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో బలాబలాలు తారుమారయ్యేలా నియోజకవర్గాలను నిర్ణయిస్తారని ప్రధాని మోదీ తదితరుల ముందు వాదించారని తెలుస్తున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఆశలు ఆడియాశలయ్యేలా ‘తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశాలు కనిపించడం లేద'ని స్పష్టమవుతోంది. ప్రత్యేకించి అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై గంపెడు ఆశలు పెట్టుకుని, ఆమేరకు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలుచేసిన చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాటలు శరాఘాతంలా మారాయి.

తెలంగాణ నేతల వ్యతిరేకతతో బీజేపీ అధిష్టానం వెనకడుగు

తెలంగాణ నేతల వ్యతిరేకతతో బీజేపీ అధిష్టానం వెనకడుగు

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ అందుకు సుముఖంగా లేనట్లు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీతోపాటు తెలంగాణలోనూ అసెంబ్లీ స్థానాల పెంచాల్సి ఉంటుంది. అలా చేస్తే తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందని, బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇతర పార్టీలనుంచి పలువురు నేతలను టీఆర్‌ఎస్‌ తన పార్టీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చి ఉందని, అసెంబ్లీ స్థానాల పెంపుతో అదనంగా వచ్చే స్థానాల్లో వారందరికీ అవకాశం కల్పించాలన్నది టీఆర్‌ఎస్‌ ఉద్దేశమని అధిష్టానానికి వివరించారు.

కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఇలా వ్యూహం

కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి ఇలా వ్యూహం

ఈ నేపథ్యంలో నియోజకవర్గాల సంఖ్య పెంపు టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందని, అదే సమయంలో నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాల్లో మార్పులు జరిగితే బీజేపీకి నష్టం కలుగుతుందని పార్టీ అధి నాయకత్వానికి బీజేపీ తెలంగాణ నాయకులు స్పష్టంచేశారు. దీంతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు దీటుగా ఎదిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అధిష్టానం స్థానాల పెంపుపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడుకు షా షాక్

చంద్రబాబు నాయుడుకు షా షాక్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇచ్చిన విందులో చోటుచేసుకున్న అంశాలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. అమిత్‌షాకు విందు ఏర్పాటుచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా వంటి అంశాలను పక్కనపెట్టి, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అసాధ్యమని అమిత్‌షా స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.

టీడీపీలోకి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

టీడీపీలోకి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు

అసెంబ్లీ స్థానాలు పెంపొదించడానికి కేంద్రం సుముఖంగా లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాటలతో తేటతెల్లం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలియ వస్తున్నది. ఇప్పటి వరకు ఏదో కబుర్లతో కాలక్షేపం చేస్తూ వచ్చినా... ఇపుడు అందరి ముందు అమిత్‌షా కుండబద్దలు కొట్టినట్లు స్థానాల పెంపు అసాధ్యమని చెప్పడంతో చంద్రబాబు షాక్‌కు గురైనట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రలోభాలకు గురిచేసి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలను తన పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు ముఖ్యనేతలను టీడీపీలోకి చేర్చుకున్నారు.

నేతల మధ్య విభేదాలు, బహిరంగ యుద్ధమే

నేతల మధ్య విభేదాలు, బహిరంగ యుద్ధమే

కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి చేర్చుకున్న నేతలందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించేలా హామీ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ముగ్గురు చొప్పున నాయకులు పోటీ పడుతున్నారు. ఇది పార్టీలో తీవ్రమైన అంతర్గత వివాదాలకు, సంక్షోభాలకు దారితీస్తోంది. ఇప్పటికే పార్టీలో వర్గపోరు తీవ్రమై నేతలు రోడ్డెక్కి పోరాటాలకు దిగుతున్నారు. ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలకు, పార్టీనే నమ్ముకొని ఇక్కడే ఉన్న అసలు పార్టీ నేతలకు మధ్య బహిరంగ యుద్ధమే జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి సొంత పార్టీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ప్రకాశం టీడీపీ తీరు ఇలా

ప్రకాశం టీడీపీ తీరు ఇలా

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ కరణం బలరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన గొట్టిపాటి రవి కుమార్ వర్గాల మధ్య విభేదాలు ఏకంగా హత్యలకు దారి తీశాయి. అద్దంకి అసెంబ్లీ స్థానం నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేశ్‌పై విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ ను భవిష్యత్ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని చంద్రబాబు వ్యూహం. ప్రకాశం జిల్లా మినీ మహానాడు సందర్భంగా కరణం, గొట్టిపాటి పరస్పరం కలబడినా.. అద్దంకిలో జోక్యం చేసుకోవద్దని కరణాన్ని చంద్రబాబు హెచ్చరించారని వార్తలొచ్చాయి.

నంద్యాల సీటుపై ఇరు పక్షాలు ఇలా

నంద్యాల సీటుపై ఇరు పక్షాలు ఇలా

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ స్థానాల పరిధిలో భూమా, శిల్పా వర్గాల మధ్య ఇదే పరిస్థితి ఉంది. భూమా నాగిరెడ్డి దంపతుల హఠాన్మరణంతో వారి తనయ అఖిలప్రియ (ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు. అది వేరే విషయం) మంత్రి కూడా అయ్యారు. తాజాగా తండ్రి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం పట్టుదలగా ఉన్న అఖిలప్రియతో శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు.

సీట్లు పెరుగకుంటే కష్టమేనంటున్న తెలుగు తమ్ముళ్లు

సీట్లు పెరుగకుంటే కష్టమేనంటున్న తెలుగు తమ్ముళ్లు

కడప, విజయనగరం, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాలన్నింటా పార్టీలో అంతర్గత పోరు ముదిరిపోయింది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వీరందరికీ వేర్వేరుగా సీట్లు సర్దుబాటు చేయడం ద్వారా అవి ఒకింత చల్లబర్చవచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ స్థానాల పెంపు జరగకపోతే ఇపుడున్న వలస నేతలందరికీ హామీ ఇచ్చినట్లు సీట్లు కేటాయించడం కష్టంగా మారుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.

నియోజకవర్గాల పెంపుపై కమలనాథుల నిరాసక్తత

నియోజకవర్గాల పెంపుపై కమలనాథుల నిరాసక్తత

రాజ్యాంగ సవరణ అవసరమైన నియోజకవర్గాల పెంపు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అసలు పట్టించుకొనే పరిస్థితే లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ అధిష్టానానికి తెలంగాణలో పాగా వేయడం ముఖ్యమని, ఏపీలో చంద్రబాబుకోసం అసెంబ్లీ స్థానాలు పెంచి ఆ రాష్ట్రాన్ని వదులుకోలేరని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం ఇలా తమకు అడ్డం తిరుగుతున్నదని టీడీపీ నేతలు చెప్తున్నారు.

ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ కష్టమే

ఇప్పటికిప్పుడు రాజ్యాంగ సవరణ కష్టమే

రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు పార్లమెంట్ వేదికగా ప్రకటించింది. కేంద్ర న్యాయశాఖ కూడా దీనిపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని అప్పటివరకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు ఉండదని స్పష్టంచేసింది. దీనిపై కేంద్ర హోం శాఖ తరఫున కేంద్రం ప్రకటనలు చేసింది. పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు ఇస్తూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని పేర్కొన్నది.

నియోజకవర్గాల పెంపుపై బాబు ఇలా

నియోజకవర్గాల పెంపుపై బాబు ఇలా

ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గాల పెంపు జరుగుతుందని పైకి ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనల ఫైలు కేంద్ర హోంశాఖ నుంచి ప్రధానమంత్రి పరిశీలనకు వెళ్లిందని, అక్కడ ఆమోదం పొందగానే 2019 ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పెంపు జరిగిపోతుందని దాట వేస్తున్నారు.

English summary
BJP President Amit Shah cleared AP CM Chandra Babu that willn't possible to increase assembly seats in Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X