ఆయనే నా హీరో- తేల్చేసిన అంబటి రాయుడు..!!
అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ గంగపాలయింది. మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీనితో ఇవ్వాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్.. ఈ సాయంత్రం 7:30కు మొదలవుతుంది.
మ్యాచ్ ఆరంభం కావడానికి అరగంట ముందు నుంచే అహ్మదాబాద్‌లో భారీ వర్షం ఆరంభమైంది. అప్పటి వరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. కొన్ని గంటల పాటు వర్షం తీవ్రత కొనసాగింది. పిచ్‌పై కవర్లు మూసివుంచినప్పటికీ- అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. స్టేడియం బయట అడుగు లోతు నీళ్లు పారాయి.

చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పారు. ఆయనకు ఇదే చివరి మ్యాచ్. ఇదివరకు అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకొన్నారు. టెస్ట్, వన్డేలు, టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి వైదొలిగారు. ఇన్ని రోజుల పాటు ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతూ వస్తోన్నారు. ఇప్పుడిక ఐపీఎల్ నుంచీ వైదొలిగారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
రిటైర్మెంట్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు అంబటి రాయుడు. సీఎస్‌కే తరఫున మ్యాచ్‌లను ఆడటానికి ఎంతో ఇష్టపడతానని పేర్కొన్నారు. 30 సంవత్సరాల కిందట క్రికెట్ ఆడటాన్ని మొదలుపెట్టానని, క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టమని అన్నారు. ఇంట్లో వాళ్లు కూడా తనను ప్రోత్సహించారని వ్యాఖ్యానించారు. వారి ప్రోత్సాహం లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదేమోనని చెప్పారు.

కేరీర్‌లో ఎన్నో ఎత్తు పళ్లాలను చవి చూశానని, మధుర స్మృతులు ఉన్నాయి.. చేదు జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. మ్యాచ్ ఆడే సమయంలో ఒత్తిడిని ఎదుర్కొనడానికే ఇష్టపడతానని, అలాంటి పరిస్థితుల్లోనే మనలోని నైపుణ్యం బయటపడుతుందని అంబటి రాయుడు పేర్కొన్నారు. క్రికెట్ కోసం కొన్నింటిని త్యాగం చేయాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు.
విద్య తన జీవితంలోకి వచ్చిన తరువాత మరింత అండ లభించినట్టయిందని, ఫామ్‌ను కోల్పోయిన సమయంలో ఆమె ఎంతో అండగా నిలిచిందని అన్నారు. తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండుల్కర్ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి టెండుల్కర్ బ్యాటింగ్‌ను చూస్తూ పెరిగానని, ఆయనను హీరోగా భావిస్తానని చెప్పారు. టెండుల్కర్ బ్యాటింగ్‌ను ప్రతీసారీ ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications