నరేంద్ర మోడీ, చంద్రబాబు: కెసిఆర్ అప్‌సెట్ అయ్యారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కేంద్రం పైన అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించలేదు. దీంతో కేంద్రం పైన కెసిఆర్ అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ఇటీవల కేంద్రం పోలవరం పైన ఆర్డినెన్స్ జారీ చేసి విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది కెసిఆర్ అసంతృప్తికి కారణమేమో అంటున్నారు. అయితే గత కేంద్ర ప్రభుత్వమే ఈ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే మోడీని ఎందుకు పిలవడం లేదనే దాని పైన తెరాస వివరణ ఇచ్చింది.

తెలంగాణ అవతరణ దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు తెరాస ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. జూన్ మాసం మధ్యలో తెలంగాణ అవతరణ ఆవిర్భావోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తున్నామని, తేదీ ఖరైరాన తర్వాత రెండు మూడు రోజుల్లో తెరాస ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తారని చెప్పారు.
కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా... ప్రధాన కార్యదర్శి, డిజిపిలు లేకుండా విఐపిలకు భద్రత కల్పించడం కష్టమని, అందుకే కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని చెప్పారు. దీనిపై కెసిఆర్ మాట్లాడుతూ.. తాను సిఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదని, ఏ హోదాలో ఆహ్వానించాలని చెప్పారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కూడా కెసిఆర్ వ్యక్తిగతంగా ఆహ్వానించలేదని తెలుస్తోంది. దీనికి కూడా ఆయన పైన ఉన్న అసంతృప్తే కారణమంటున్నారు. టిడిపిని వీడి 2001లో కెసిఆర్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2009 ఉద్యమం సమయంలో కెసిఆర్, తెరాసలు ప్రధానంగా చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కంటే టిడిపిని, చంద్రబాబునే కెసిఆర్ టార్గెట్ చేశారు. అందుకు తెలంగాణలో టిడిపికి మంచి క్యాడర్ ఉండడమే కారణం.
దీనికి టిటిడిపి నేతలు కూడా ధీటుగా స్పందిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస, టిడిపి మధ్య జరిగిన వాగ్యుద్దం ఇరువురి మధ్య తీవ్ర అసంతృప్తికి దారి తీశాయంటారు. ఈ కారణంగానే బాబును కెసిఆర్ వ్యక్తిగతంగా ఆహ్వానించలేదంటున్నారు. దీనిపై టిటిడిపి నేతలు మాట్లాడుతూ.. తమను ఆహ్వానించక పోవడం కెసిఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications