వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కారాలు: జగన్‌ను దెబ్బ కొట్టాలని చూస్తే బాబుకే ఎదురు దెబ్బ?

జగన్‌ను దెబ్బ కొట్టాలని వ్యూహరచన చేసి అమలు చేస్తున్న పథకం చంద్రబాబుకు ఎదురుతిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఆయన చేయి దాటిపోతున్నట్లు అనిపిస్తోంది.

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తూ వచ్చింది. అధినేత ఓ మాట చెప్తే జవదాటడం అనేది ఉండేది కాదు. కానీ, ఇటీవలి కాలంలో తెలుగు తమ్ముళ్లు బజారుకెక్కుతున్నారు. అంతేకాదు, ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.

ప్రస్తుత తీరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ఉదంతం దానికి పరాకాష్టగా కనిపిస్తోంది.

అంతేకాదు, చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఉదంతాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు.

ఎమ్మెల్యేల తిరుగుబాటు

ఎమ్మెల్యేల తిరుగుబాటు

పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించింది. ఆ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించినంత పని చేశారు. గన్‌మెన్‌ను వెనక్కి పంపించి తమ నిరసనను తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదు చేయడంతో టిడిపి ఎమ్మెల్యేలు నిరనస వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, రైటర్‌ను దుర్భాషలాడారానే ఆరోపణ మీద ఎమ్మెల్యే రాధాకృష్ణను ఏ-1 నిందితునిగా గుర్తిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు నిరసనగా తమ గన్‌మెన్లను వెనక్కి పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నంత పనీ చేశారు. జిల్లా ఎస్సీ భాస్కర్ భూషణ్ ను టార్గెట్ చేస్తూ.. జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు పోలీసుల వైఖరికి నిరసనగా తమ గన్ మెన్లను తిప్పి పంపించేశారు. ఈ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించింది. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధినేతకు విజ్ఞప్తులు చేయడానికి బదులు తిరుగుబాటు ప్రకటించడం తెలుగుదేశం పార్టీలో కొత్త పరిణామం.

కరణం వర్సెస్ గొట్టిపాటి...

కరణం వర్సెస్ గొట్టిపాటి...

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య జరుగుతున్న పోరు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇటీవల జరిగిన హత్యలతో ఈ వర్గాల మధ్య నిప్పు రాజుకుంది. దీంతో మినీ మహానాడును కూడా ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. దాదాపు ఏడాది క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. కాగా, గొట్టిపాటి రాకను అప్పుడే కరణం బలరాం గట్టిగా వ్యతిరేకించారు. కానీ, అధిష్టానం మాత్రం గొట్టిపాటిని టీడీపీలో చేర్చుకుంది. అప్పటి నుంచి వీరి మధ్య మరింత వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

చంద్రబాబు చెప్పినా వినని కేశినేని

చంద్రబాబు చెప్పినా వినని కేశినేని

బిజెపిపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు హెచ్చరించినా కూడా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పెడచెవిన పెట్టారు. పైగా, ఆ హెచ్చరికలను ధిక్కరిస్తున్నట్లుగా మరో ప్రకటన చేశారు. తల పగిలినా కొండకు ఢీకొట్టేందుకు తాను సిద్దమేనని, అది తన కాన్ఫిడెన్స్ అని కేశినేని అన్నారు. బీజేపీపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది చెప్పారు.బీజేపీతో పొత్తు లేకుంటే టీడీపీ మరిన్ని స్థానాలు గెలుచుకునేదన్న వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

పురంధేశ్వరి ఫైర్..

పురంధేశ్వరి ఫైర్..

కేశినేని మరోసారి బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడి బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరికి అస్త్రాన్ని అందించారు. కేశినాని నాని వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ఆమె చంద్రబాబును డిమాండ్ చేశారు. బిజెపితో పొత్తు వల్ల తమకు ఓట్లు తగ్గాయని, లేదంటే టిడిపి మరింత మెజార్టీతో గెలిచేదన్న వ్యాఖ్యలను చాలా బిజెపి సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మరోసారి స్పందించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆ రకంగా బిజెపితో వివాదం ముదరకుండా చూడాలనే చంద్రబాబు ఆలోచనకు బ్రేకులు పడ్డాయి.

పార్టీ తీరుపై అనిత

పార్టీ తీరుపై అనిత

టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికీ, పార్టీకీ విధేయంగా ఉంటూ వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాను ఎదుర్కోవడానికి చంద్రబాబు ఆమెను ప్రధానాస్త్రంగా ప్రయోగించారని అంటున్నారు. అటువంటి అనిత పార్టీ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పులో టీడీపీ నాయకులకు సైతం శిక్ష పడటాన్ని ప్రస్తావిస్తూ.. పార్టీ పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆమె అన్నారు. నక్కపల్లి తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. 10ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ఇప్పుడు టీడీపీకి చెందిన 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో వున్న నాయకుల్లో వెంకటేష్‌, బొల్లం బాబ్జీ తనకు సోదరుల్లాంటి వారని, మీ కంటే నాకే ఎక్కువ బాధ ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. 2007లో బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటు సమయంలో జరిగిన మత్స్యకారుడి హత్యకు సంబంధించి అనకాపల్లి సెషన్స్ కోర్టు మాజీ ఎమ్మెల్యే చెంగల్రావు సహా మరో 15మందికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. మరో ఐదుగురికి జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇలా...

డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇలా...

ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవుల నియామకంపై మాదిగ కులస్థుల్లో అసంతృప్తి ఉందని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు. మాలలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని మాదిగల్లో అసంతృప్తి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ విషయాలన్నింటిని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు మాణిక్యవరప్రసాద్ చెప్పారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ మాటలు బయటకు మామూలుగానే కనిపిస్తున్నప్పటికీ అవి తీవ్రమైనవేనని భావిస్తున్నారు.

 అఖిలప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి...

అఖిలప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి...

నంద్యాల సీటు కేటాయింపుపై కర్నుూలు జిల్లాకు చెందిన మంత్రి భూమా అఖిలప్రియకు, శిల్పా మోహన్ రెడ్డికి మధ్య వివాదం తలెత్తింది. సంప్రదాయం ప్రకారం ఆ సీటు తమ కుటుంబానికి కేటాయించాలని అఖిలప్రియ కోరుతుండగా తనకు ఇచ్చిన హామీ మేరకు తనకే ఆ సీటు ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. ఈ వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించింది. ప్రస్తుతానికి ఆ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేనాటికి మళ్లీ బయటపడే అవకాశం లేకపోలేదు. ఇరు వర్గాల మధ్య పోరు అసలుకే ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదు.

రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి...

రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆదినారాయణ రెడ్డి...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి తీసుకోవడంతో రామసుబ్బారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. జమ్మలమడుగులో ఇరువురి గ్రూపుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి చంద్రబాబు సూచనలను, ఆదేశాలను ధిక్కరించే స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కూడా ఉంది.

ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లనే....

ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్లనే....

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను మాత్రమే కాకుండా కాంగ్రెసు, వైసిపి నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం వల్ల ఎక్కువగా సమస్య ఎదరవుతున్నట్లు కనిపిస్తోంది. ఫిరాయింపుల ద్వారా వైయస్ జగన్‌ను దెబ్బ కొట్టాలని చూసిన చంద్రబాబు వ్యూహం ఎదురు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికీ, కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో పరిస్థితి చంద్రబాబు చేయి దాటిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

అసలు సమస్య ఇదీ....

అసలు సమస్య ఇదీ....

టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిష్టానం మాటలను జవదాటేవారు కాదు. ఏవైనా సమస్యలుంటే చంద్రబాబుకు చెప్పి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెసులో ఉన్నప్పుడు స్వేచ్ఛగా వ్యవహరించిన నాయకులు టిడిపిలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్వేచ్ఛతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నవారు కూడా చాలా మంది పాత కాంగ్రెసు నాయకులే. అందువల్ల కాంగ్రెసులోని స్వేచ్ఛా వాతావరణానికి భిన్నంగా వారు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఉండలేకపోతున్నారు. ఇది చంద్రబాబుకు అసలు సమస్యగా మారింది.

English summary
According to political analysts - Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu naidu is facing trouble with internal bickerings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X