జెన్ జీ కోసం వ్యూహాలు మార్చేస్తున్న జగన్, చంద్రబాబు-ఢిల్లీ ట్విస్టుల వేళ..!
జాతీయ స్దాయిలో తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లోనూ లెక్కల్ని మార్చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ విభజన తర్వాత అనివార్యంగా బీజేపీ చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు, జగన్ .. ఇప్పుడు ఢిల్లీ పరిణామాలతో తమ వ్యూహాల్ని పునస్సమీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎవరికి వారు జెన్ జీకి (Gen Z) దగ్గరయ్యేందుకు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. దీంతో జగన్, చంద్రబాబు ఎత్తుగడలపై ఇప్పుడు జాతీయ స్దాయిలో చర్చ జరుగుతోంది.
జెన్ జీతో బీజేపీకి పెరుగుతున్న దూరం (Gen Z)
కేంద్రంలో పుష్కరకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న వరుస నిరసనలతో జెన్ జీ మద్దతు కోల్పోతోంది. తిరిగి వారిని ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జంతర్ మంతర్ నిరసనల తర్వాత ఇన్ స్టా లో యాక్టివ్ గా ఉండాలని, సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టాలని, జెన్ జీతో అనుబంధం పెంచుకోవాలని మంత్రుల్ని ప్రధాని మోడీ పదే పదే కోరుతున్నారు. తదనుగుణంగా బీజేపీ ఎంపీలు సైతం పార్లమెంట్ లో జెన్ జీ భాష వాడటం మొదలుపెట్టారు. అయినా జెన్ జీని ఆకట్టుకునే విషయంలో బీజేపీ వెనుకబడే ఉంది. ఇదే ఇప్పుడు ఏపీలో ఇన్నాళ్లూ బీజేపీకి మద్దతుగా నిలిచిన చంద్రబాబు, జగన్ ను ఆత్మరక్షణలో పడేస్తోంది. 2029 ఎన్నికల నాటికి జెన్ జీ బీజేపీకి పూర్తిగా దూరమైతే ... తాము కూడా మునిగిపోవడం ఖాయమని భావిస్తున్న వీరిద్దరూ తమ వ్యూహాల్ని పునస్సమీక్షించుకుంటున్నారు.

జెన్ జీ వైపు జగన్ ముందడుగు
ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా జెన్ జీ నిరసనలు సాగుతున్న వేళ వీటికి నేతృత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి జగన్ తొలిసారి మద్దతుగా నిలిచారు. నీట్ నిరసనల సమయంలో ఇలా జగన్ సీజేపీకి అండగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా సీఈసీ జ్ఞానేష్ రాజీనామా కోసం ముంబై, ఢిల్లీలో నిరసనలకు దిగిన కాక్రోచ్ లకు మద్దతుగా జగన్ వ్యాఖ్యలు కొనసాగించారు. ఇది సహజంగానే బీజేపీకి మంట పుట్టిస్తోంది. ఫలితంగా ఏపీలో ఇన్నాళ్లూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో జగన్ ను చూసీచూడనట్లుగా వదిలేసిన బీజేపీ.. ఇప్పుడు ఆయా దర్యాప్తు సంస్థల్ని పరుగులు తీయిస్తోంది. దీంతో జగన్ అనివార్యంగా బీజేపీకి గుడ్ బై చెప్పేసి ఇండియా కూటమివైపు అడుగులు వేయక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీనిపై ఇప్పటికే తెరవెనుక చర్చలు మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి.
విజయ్ తో చంద్రబాబు భేటీ
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జగన్ మొదలుపెట్టిన ప్రయత్నాలతో సహజంగానే ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కూడా వ్యూహం మార్చారు. ఇండియా కూటమిలో నేరుగా భాగస్వామి కాకపోయినా, తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న విజయ్ ను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయ్ ను విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. పనిలో పనిగా నదుల అనుసంధానం పేరుతో ఆయనతో చర్చలు కూడా జరిపారు. తమిళనాడులో జెన్ జీ మద్దతుతో విజయ్ అధికారంలోకి వచ్చారన్న కారణంతో ఆయనకు దగ్గర కావడంతో ద్వారా జెన్ జీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం కూడా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు జెన్ జీ ఐకాన్ గా ఎదుగుతున్న విజయ్ కు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు జాతీయ స్ధాయిలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఇప్పటికిప్పుడు బీజేపీ స్పందించకుండా మౌనం వహిస్తోంది.

2029 నాటికి ఏం జరగబోతోంది ?
ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలతో జెన్ జీకి దగ్గరయ్యేందుకు జగన్, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అంతిమంగా బీజేపీకి వీళ్లిద్దరినీ దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో జగన్ ముందుండగా.. చంద్రబాబు ఆ తర్వాత స్ధానంలో ఉన్నారు. జగన్ నేరుగానే ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా.. చంద్రబాబు మాత్రం ప్రస్తుతానికి ఆ విషయంలో దాటవేత ధోరణితో ఉన్నారు. కానీ ఏపీలో జగన్ ఈసీకి వ్యతిరేకంగా భారీ పోరు మొదలుపెడితే మాత్రం చంద్రబాబు కూడా ఆత్మరక్షణలో పడటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీంతో సీఈసీపై పోరాటాలు చేస్తున్న విజయ్ ను సైతం చంద్రబాబు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్, చంద్రబాబులో ఎవరు ఇండియా కూటమిలో ముందు చేరతారన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే వినిపిస్తున్నాయి. ఇందులో వీరిద్దరూ ఎదుర్కొంటున్న కేసులే కీలక పాత్ర పోషించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
