కుప్పంపై దృష్టి పెట్టనున్న జగన్ .. అమేధీ తరహా వ్యూహ రచనలో వైసీపీ బాస్ ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం పై దృష్టి సారిం చారా ? కుప్పం నియోజకవర్గంలో బిజెపి అమేథీలో అనుసరించిన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అనుసరించబోతున్నారా ? 2024 టార్గెట్ గా వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

కుప్పం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టనున్న జగన్
కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడు ఈసారి అతికష్టం మీద 30 వేల మెజారిటీతో మాత్రమే గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబు నాయుడుని ఓడించాలని కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారించారు ఏపీ సీఎం జగన్. అందులో భాగంగా అధికారులకు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. కుప్పంలో వైసిపిని ఓడించినప్పటికీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ ఐదేళ్లు కుప్పం నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

అమేథీ తరహా వ్యూహ రచనలో జగన్ .. అమేధీ బీజేపీ ప్లాన్ కుప్పంలో అమలు
తాజా ఎన్నికల్లో అమేధీలో బిజెపి వ్యూహం ఎలా అయితే అమలుచేసి స్మృతి ఇరానీని గెలిపించారో .. రాహుల్ గాంధీని ఓటమి పాలు చేశారో ఆ ప్లాన్ తోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం పై దృష్టి సారించారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అమేధీలో బిజెపి ఓటమి పాలైంది. అయినప్పటికీ బిజెపి అమేధీ అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించి అయిదేళ్ల పాటు పని చేసింది. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమేధీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీకి పట్టం కట్టారు. ఇప్పుడు జగన్ సైతం అమేథీలో బిజెపి అనుసరించిన వ్యూహాన్నే కుప్పం నియోజకవర్గంలో అనుసరించాలని భావిస్తున్నారు.

చంద్రబాబును ఇబ్బంది పెట్టె ఆలోచనలో జగన్ .. 2024 ఎన్నికలకు ఇప్పటి నుండే వ్యూహం
ఒకవేళ నిజంగానే జగన్ కుప్పం నియోజకవర్గం పై దృష్టి పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తే 2024 ఎన్నికల్లో అది టిడిపి బాస్ చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామాలను తెచ్చిపెడుతుంది. పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ ఈ ఐదేళ్ళ పాటు మాత్రమే కాకుండా 2024 లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గం పై ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications