హైకోర్టులో జగన్ కీలక పిటీషన్, అదే బాటలో వైసీపీ ఎమ్మెల్సీలు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. కూటమి నేతలు తమ విజయం ఏకపక్షమని ప్రచారం చేస్తున్నారు. అటు వైసీపీ భిన్నంగా స్పందిస్తోంది. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసినా ఓటర్లు తమ వైపే నిలిచారని చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసుల అంశంలో జగన్, వైసీపీ ఎమ్మెల్సీలు పిటీషన్లు దాఖలు చేసారు.
మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పులివెందులలో తన పైన నమోదైన కేసులను క్వాష్ చేయాలని అభ్యర్ధించారు. పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పైన కేసులు నమోదయ్యాయి. పులివెందులలో నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్ రోజున కీలక అంశాలు తెర మీదకు వచ్చాయి. పోలింగ్ వేళ తమ ఏజెంట్లకు అవకాశం లేకుండా చేసారని జగన్ నిరసనకు దిగారు. ప్రభుత్వం పోలీసుల సాయంతో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోలింగ్ రోజు పులివెందుల మున్సిపల్ కార్యాలయం వద్ద జగన్ ధర్నా చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేశారని ఈ మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జగన్ తో పాటుగా అవినాశ్, ధర్నాలో పాల్గొన్న మరో 70 మంది పైనా కేసు రిజిస్టర్ అయింది. అయితే, జగన్ ఎన్నికల ఆర్వో కు వినతి పత్రం ఇచ్చారు. పోలింగ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అదే విధంగా ఎన్నికల కోడ్ ఉన్నా ర్యాలీ నిర్వహణ పైనా కేసు నమోదైంది.

పార్టీ నేతలతో జగన్ సమావేశం
దీంతో.. ఇప్పుడు ఈ కేసులను క్వాష్ చేయాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. కాగా.. ఎన్నికల సమయంలో ఎస్ఈసీ పైన ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భైఠాయించి నిరసనకు దిగారు. దీంతో, పలువురు వైసీపీ ఎమ్మెల్సీల పైన కేసు నమోదైంది. ఈ కేసులను క్వాష్ చేయాలని ఎమ్మెల్సీలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కాగా.. ఇప్పుడు ఈ కేసుల విషయంలో హైకోర్టు విచారణ.. తీసుకునే నిర్ణయాల పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక.. తాజా ఫలితాల పైన పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమీక్ష చేయనున్నారు. గెలిచిన అభ్యర్ధులతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా ఎన్నికల్లో పోటీ చేసిన వారితోనూ జగన్ భేటీ అవుతారని పార్టీ నేతల సమాచారం.












Click it and Unblock the Notifications
