వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానకీరామ్ మృతి: ప్రమాదం ఎలా జరిగిందంటే...

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ దుర్మరణం చెందారు. జానకీరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు. నారును ట్రాక్టర్‌లో లోడ్‌ చేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. నిజానికి, తన ఊరు చేరుకునేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంది. రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో, రాంగ్‌రూట్‌లో వస్తూ డివైడర్‌ వద్ద హైదరాబాద్‌ రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ట్రాక్టర్‌ ఇంజన్‌ ముందుకు వెళ్లింది. ట్రాలీ మాత్రం విజయవాడవైపు వెళ్లే రోడ్డుపై మిగిలింది. జానకిరాం సఫారీ ఈ ట్రాలీనే ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకన్నకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ దుర్ఘటన తర్వాత ఆయన సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.

వార్తాకథనాల ప్రకారం - ప్రమాదంలో సఫారీ నుజ్జునుజ్జుగా మారింది. ట్రాక్టర్‌ ఇంజన్‌, ట్రాలీ వేరై చెల్లాచెదురయ్యాయి. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. వాహనం స్టీరింగ్‌ బలంగా ఒత్తుకుపోవడంతో జానకిరాం పక్కటెముకలు, కుడిచేయి విరిగిపోయాయి. ఛాతీపై రక్తగాయాలయ్యాయి. జానకిరాం తన వాహనంలోనే ఇరుక్కుపోయారు. వాహనంలో ఆయన ఒంటరిగా ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అటువైపుగా ద్విచక్ర వాహనంలో వెళ్లిన వెంకటేశ్‌ అనే యువకుడు భారీ శబ్దం వినిపించడంతో వెనుతిరిగి చూశాడు.

చెల్లాచెదురైన ట్రాక్టర్‌, సఫారీ వాహనాలు కనిపించాయి. ఆయన హుటాహుటిన బైక్‌ను వెనక్కి తిప్పి సంఘటన స్థలానికి వచ్చారు. ట్రాక్టర్‌ ఉంది గానీ దాని డ్రైవర్‌గానీ, ఇతర వ్యక్తులుకానీ కనిపించలేదు. సఫారీలో డ్రైవర్‌ సీటులో జానకిరాం కనిపించారు. జానకిరాంను కాపాడేందుకు ప్రయత్నించారు. తాను నందమూరి హరికృష్ణ కుమారుడిని అని చెబుతూ ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

ఈలోగా మరికొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. 108కు సమాచారం అందించారు. జానకిరాంను వాహనం నుంచి బయటికి తీశారు. అక్కడే ఉన్న ఆయన సెల్‌ఫోన్‌ తీసుకుని, ఇన్‌కమింగ్‌ జాబితాలో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ కాల్‌ చేశారు. అది జానకిరాం సోదరుడు, సినీ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌కు వెళ్లింది. ప్రమాద సమాచారాన్ని వారు కల్యాణ్‌రామ్‌కు అందించారు. ఈలోపు 108 వాహనం వచ్చింది. జానకిరాంను తొలుత కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కోదాడలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జానకిరాం అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Janakiram - car

ఉస్మానియాలో పోస్టుమార్టం

జానకిరాం మృతదేహాన్ని తొలుత పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. అప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిపారు. కోదాడలో సరైన సౌకర్యాలు లేవని, అభిమానుల తాకిడివల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. హైదరాబాద్‌లోనే పోస్టుమార్టం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. దీంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకరరావుతో ఫోన్‌లో మాట్లాడారు.

హైదరాబాద్‌లో పోస్టుమార్టంకు అనుమతించాలని కోరారు. ఇందుకు వీరు అంగీకరించారు. దీంతో జానకిరాం మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్‌ తరలించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఫోరెన్సిక్‌ విభాగం నిపుణులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయంలో జానకిరాం మృతదేహాన్ని మాసబ్‌ట్యాంక్‌లోని హరికృష్ణ నివాసానికి తరలించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు జానకిరాంకు నివాళలు అర్పించారు.

English summary
Nandamuri Hari Krishna's elder son and actor Kalyan Ram's elder brother Nandamuri Janaki Ram has passed away. The accident took place on Saturday when Janaki Ram was on his way to Vijayawada from Hyderabad. According to reports, Janaki Ram was driving the car. Janaki Ram was said to be alone in the car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X