ఆవేశం తగ్గించుకోలేని అమాయక రాజకీయం!!??
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో ఆవేశం తొంగిచూస్తుంటుంది. ఏది మాట్లాడినా ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించడంవల్ల. ఆయన ఎందుకు అంత ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు? ఎందుకు అలా స్పందిస్తున్నారు? అని మనలో మనం ప్రశ్నించుకుంటే కొన్నిటికి సమాధానాలు దొరుకుతాయి.

విభిన్నమైన ఆలోచనల్లో పవన్ కల్యాణ్
వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని నిజాయితీ, న్యాయం, ధర్మంతో కూడి రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ సేవచేయాలని, ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదంటూ ఆయన భిన్నమైన ఆలోచనల్లో ఉంటారు. తన ఆలోచనారీతిని ఆయన మాటల రూపంలో వ్యక్తం చేస్తుంటారు. మనందరం ఎన్నో సినిమాల్లో కొన్ని సన్నివేశాలను చూసుంటాం.. నిజాయితీ కలిగిన కథానాయకుడుకానీ, ఇతర పాత్రధారులుకానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరు. దానికి కారకులవుతున్నవారిని ఎదురించి మాట్లాడటంతోపాటు హెచ్చరికలు జారీచేస్తుంటారు.

పుస్తకాలతో మారిన భావజాలం!
మంచి మంచి పుస్తకాలను ఎక్కువగా చదివే పవన్ కల్యాణ్ తన భావజాలాన్ని ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. పుస్తకాలు, వాటిని రాసిన ప్రసిద్ధ రచయితల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉంది. సినిమాల్లో ఎలా అయితే అవినీతిని ప్రశ్నిస్తుంటామో.. అదే రీతిలో ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వకూడదనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ దృష్టిలో ఏపీ పూర్తిగా వెనకబడిపోయిందని, అభివృద్ధి మందిగించిందని, అధికార పార్టీ అనైతికాలకు, అవినీతికి పాల్పడుతోందని, మనం సినిమాల్లో చూసినట్లుగా పరిపాలన కొనసాగిస్తున్నారనే యోచనలో పవన్ ఉండిపోయారు.

అంతిమంగా కావాల్సింది.. ప్రజల శ్రేయస్సే!
వాస్తవ ప్రపంచంలో ఆయన వెతికినా, సినిమాల్లో వెతికినా, పుస్తకాల్లో వెతికినా పవన్ కు తాను కోరుకున్న సమాజంకానీ, తాను కోరుకున్న రీతిలో ప్రజలు కానీ కనపడటంలేదు. తన ఆవేశాన్ని కూడా దాచుకోలేని అమాయకత్వంతో రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తాడోనన్న అపనమ్మకం ఆయన సోదరుడు చిరంజీవికి కూడా ఉంది. మరోవైపు పెద్ద పదవిలో చూడాలని ఉంది అంటారు. ఏదేమైనప్పటికీ పవన్ కల్యాణ్ రాజకీయంకానీ, పవన్ కల్యాణ్ మనస్తత్వంకానీ, పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణికానీ, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంకానీ... అన్నింటినీ ఒకేగాటను కట్టేయవచ్చు. ఎందుకంటే అవన్నీ చివరి వరకు కోరుకునేది ప్రజల శ్రేయస్సునే.!!












Click it and Unblock the Notifications