టీడీపీతో సీట్ల డీల్ ఖరారు..! జనసేన కీలక ప్రకటన..!
ఏపీలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఉన్న సమన్వయం చెడిపోకుండా ఎన్ని స్ధానాల్లో ఏయే పార్టీ పోటీ చేయాలన్న అంశంపై టీడీపీ-జనసేన మధ్య జరిగిన చర్చలు (TDP-Janasena) ఫలించాయి. రెండు రోజులుగా పలు దఫాలుగా జనసేన కీలక నేతలు టీడీపీతో జరిపిన చర్చలు ముగిశాయి. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ కీలక ప్రకటనలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కోసం టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు చర్చలు సఫలం అయ్యాయని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు.ఇవాళ సీఎం చంద్రబాబుతో జనసేన నాయకుల సమన్వయ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇతర ఎమ్మెల్యేలు కూడా తెలిపారు. కూటమి పార్టీల్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు. 2024లో కూటమి తరహాలోనే స్థానిక ఎన్నికలకు పోటీచేస్తామని, ఎవరికి బలమున్న చోట వారు పోటీ చేస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి తెలిపారు.

స్ధానిక ఎన్నికల్లో సింగిల్ ఎజెండాతో, కూటమిగానే పోటీలోకి దిగనున్నామని బొలిశెట్టి తెలిపారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. ఈ చర్చల్లో ఎలాంటి పర్సంటేజీల కోసం చర్చించలేదని, సీట్ల రేషియో కాదు, గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పార్టీ పరంగా కాకుండా, కూటమి పరంగా అభ్యర్థులను ప్రకటిస్తామని బొలిశెట్టి ప్రకటించారు. జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు కేడర్ సంతృప్తి చెందేలా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని మరో ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే క్లారిటీ కూటమి పార్టీలకు ఉందన్నారు. రాష్ట్రం బాగు కోసం జనసేన కట్టుబడి ఉందని వంశీకృష్ణ తెలిపారు. అయితే ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే అంశాన్ని జనసేన ఎమ్మెల్యేలు వెల్లడించలేదు. బీజేపీతో కూడా చర్చలు పూర్తయిన తర్వాత ఉమ్మడిగా వీటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
