స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల- నామినేషన్లు, పోలింగ్, ఫలితాలు ఇలా...!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఏ ఎన్నిక ఎప్పుడు జరిగేదీ... నామినేషన్లు, పోలింగ్.. ఫలితాల తేదీలను ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటన చేయటంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఖరారు చేసింది. మున్సిపల్ ఆ తరువాత పరిషత్ ఎన్నికల నిర్వహణ కు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ విడుదల చేయటంతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. వరుసగా ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటనతో.. రాజకీయ పార్టీ లు తమ అభ్యర్ధులను ఖరారు చేయటంలో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునీఠ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్లకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థలు, వాటిలోని వార్డులు ఈ జాబితాలో ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజునే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఎన్నికల ప్రక్రియ రెండో దశలో 28 జిల్లా పరిషత్లు, 659 జడ్పీటీసీలు, ఎంపీపీలు... 9848 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. 13 కార్పోరేషన్లు, 77 మున్సిపాల్టీలు, 10 నగర పంచాయితీలకు నోటిఫికేషన్ జారీ అయింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు 18 వ తేదీ చివరి తేదీగా ఖరారు చేసారు. 19న స్క్రూటినీ, 21వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. అదే విధంగా 28న పోలింగ్.. 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
కాగా.. ఈ నెల 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎన్నికలకు 23వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా ఖరారు చేసారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
నవంబర్ 13న పంచాయితీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 17వ తేదీ తొలి విడత పంచాయితీకి తుది గడువుగా ఖరారు చేసారు. 26న తొలి విడత పంచాయితీ పోలింగ్, 29న రెండో విడత పంచాయితీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ నాడే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.














Click it and Unblock the Notifications
