జగన్ చేజారుతున్న కడప, అనూహ్య పరిణామాలు..!!
కడప కేంద్రం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా లో ఊహించని రాజకీయం తెర మీదకు వస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత రికార్డు మెజార్టీతో కడప ఎంపీగా గెలిచిన జగన్.. తరువాత జిల్లాలో పట్టు కొనసాగించారు. 2024 ఎన్నికల్లో సొంత జిల్లాలోనూ ఊహించని ఫలితాలు వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ వైసీపీ ఓడిపోయింది. కాగా.. ఇప్పుడు కడప పైన కూటమి పట్టు బిగుస్తోంది. ఈ నెల 11న కడప కేంద్రంగా కీలక నిర్ణయానికి ముహూర్తం ఖరారైంది.
కడప కేంద్రంగా కూటమి నేతలు జగన్ సమర్థతకు పరీక్ష పెడుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక తరువాత ఇప్పుడు నేరుగా కడప లోనే జగన్ పార్టీకి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పుడు కడప మేయర్ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ నెల 11వ తేదీన కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ కూడా ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని తెలియజేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ 2 రోజుల కిందటే కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ బాబును పదవి నుంచి తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను నియమించారు. అయితే మరో 5 నెలల పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి తీర్మానాలు తప్పనిసరని భావించి మేయర్ ఎన్నిక అనివార్యమైంది.
ఈ మేరకు ఎన్నికల కమిషన్ మేయర్ పదవి కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై సురేష్ బాబు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్‌పై ఈ నెల 9వ తేదీన హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే ఒకసారి పదవి నుంచి తొలగించినప్పటికీ, కోర్టు ఆదేశాల వల్ల తిరిగి వాదనకు అవకాశం ఇచ్చారు. వైసీపీ కోర్టు వైపు చూస్తుండగా.. కూటమి నేతలు తమ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్దం అవుతు న్నారు. దీంతో.. కడప కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications