జూనియర్ ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్ర: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నుంచి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకి తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొడాలి నాని.. చంద్రబాబుపై మండిపడ్డారు. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును రానున్న ఎన్నికల్లో ఓడించాలంటూ నాని పిలుపునిచ్చారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తుందని చెప్పుకొచ్చారు.

పనికిరాని చంద్రబాబు, లోకేష్‌ని గెలిపిస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే.. జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా బయటకు గెంటి టీడీపీని ఆక్రమించుకుంటారని కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు.
120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రెండు లక్షల 50 వేల కోట్లు బదిలీ చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం.. ప్రజలు రెండుసార్లు ఈవీఎం బటన్ నొక్కాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. చంద్రముఖిని ఈ ఒక్కసారి ఈవీఎంలో బంధిస్తే.. చంద్రబాబు అనే పేరు అంతరించిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మంగళగిరి వేదికగా టీడీపీ-జనసేన ఉమ్మడిగా జయహో బీసీ పేరిట బహిరంగ సభను నిర్వహించి.. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన నేపథ్యంలో కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications