చంద్రబాబు బీసీ భజన; పవన్ కళ్యాణ్ తో అలా: కొడాలి నాని ఘాటువ్యాఖ్యలు!!
టిడిపి అధినేత చంద్రబాబు బీసీ సదస్సులో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసి ఇప్పుడు బీసీల భజన చేస్తామంటే ఎవరు నమ్మరని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు టీడీపీకి బీసీలు వెన్నుముక అని ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఓసి అని చంద్రబాబు చేసేది మాత్రం బీసీ భజన అని, చంద్రబాబు భజనలు ప్రజలు నమ్మబోరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. బీసీల కోసం చంద్రబాబు కొత్తగా ఏం పాటు పడ్డాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. ఇక ఏపీలో బీసీలకు న్యాయం చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు.

జనరల్ సీట్లలో కూడా బీసీలకు టికెట్లు ఇచ్చి బీసీలకు పదవులు ఇచ్చి వారికి సీఎం జగన్ ప్రాధాన్యతను ఇస్తున్నారని కొడాలి నాని తెలిపారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ సీట్లు ఇచ్చారా చెప్పాలంటూ ప్రశ్నించారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు రాజ్యసభ సీట్లను బీసీలకు ఇచ్చారన్నారు.
బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని కొడాలి నాని తెలిపారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడికి మబ్బులన్నీ విడిపోతాయంటూ కొడాలి నాని చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే నిన్న ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన 'జయహో బీసీ' సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడాతూ బీసీల కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు.
నిరుపేద బీసీలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. జయహో బీసీ లక్ష్యాలను లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా తెలుగు దేశం ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు తెలిపారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని చంద్రబాబు అన్నారు. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు.
125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు .నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు.












Click it and Unblock the Notifications