మంచు మనోజ్ రెండో వివాహంపై స్పందించిన మోహన్‌బాబు కుటుంబం
మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన సోదరి మంచు లక్ష్మి స్పందించారు. తన సోదరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మనోజ్ త్వరలోనే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరి కోరారు.

నిస్వార్థమైన ప్రేమ దొరకబోతోంది!
ఎవరి బతుకు వారిని బతకనివ్వాలని, ఇప్పుడున్న రోజుల్లో నిజాయితీతో కూడిన నిస్వార్థమైన ప్రేమను పొందడం కష్టమన్నారు. కానీ మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నందుకు తానెంతో ఆనందిస్తున్నానని, అతనికి తన ఆశీస్సులు జీవితకాలం ఉంటాయని వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవలే జరిగిన ఒక ప్రెస్ మీట్ లో విష్ణు చేసిన కామెంట్స్ పై లక్ష్మి మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యాక విష్ణుపై ప్రతికూల ప్రచారం బాగా జరిగిందని, అవన్నీ పనికిరాని విషయాలన్నారు.

బురద చల్లేందుకు సిద్ధంగా ఉంటారు!
రాజకీయ వ్యవస్థలో ఒకరు బాగున్నారంటూ వారిపై బురద జల్లేందుకు కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, ఒక రంగంలోకి వెళ్లిన తర్వాత మంచితోపాటు చెడును కూడా ఆహ్వానించాలని, పరిశ్రమలో కథానాయకులంతా బాగానే ఉంటారన్నారు. అభిమానులే కొట్టుకుంటుంటారని, అది ఎందుకో ఇప్పటికీ తనకు అర్థం కాలేదన్నారు. కొందరు ఎప్పుడూ అనుకూలతల గురించి ఆలోచించరని, కేవలం ప్రతికూలతల గురించే ఆలోచిస్తారని, ఎంత మంచి చేసినా వాళ్లు చెడుగానే చూస్తుంటారన్నారు. ప్రతికూలతను ఆహ్వానించడానికి విష్ణుకు కొంత సమయం పడుతుందని, అది ఒక పాఠాన్ని నేరపిస్తుందని, అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని సూచించారు.

భూమా నాగిరెడ్డి రెండో కుమార్తెతో వివాహం?
లక్ష్మి ప్రస్తుతం 'అగ్ని నక్షత్రం' సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. 'ఆహా' వేదికగా ప్రసారమవుతోన్న 'చెఫ్ మంత్ర సీజన్ -2'కు వ్యాఖ్యాతగా ఉన్నారు. మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వెల్లడించారు. వినాయకచవితి సందర్భంగా మనోజ్, భూమా మౌనిక ఇద్దరూ జంటగా వినాయక మండపందగ్గర దర్శనమివ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహమే కాబోతోంది.












Click it and Unblock the Notifications