అసలు కారణం వేరే..! అందుకే అనర్హత పిటిషన్ల తిరస్కరణ : బుగ్గన

Subscribe to Oneindia Telugu

కర్నూల్ : పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 13 మంది వైసీపీఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించడంతో వైసీపీ నేతలు విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా కోడెల చర్యలు ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు.

పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అన్ని ఆధారాలను స్పీకర్ ముందుంచిన తరువాత కూడా గ్రామర్‌ తప్పులున్నాయి, ఫుల్‌స్టాప్‌, కామాలు లేవు అనే సాకులు చెబుతూ పిటిషన్లను తిరస్కరించడం సరైంది కాదని మండిపడ్డారు.

వైసీపీ అందజేసిన పిటిషన్లలో నిజంగానే తప్పులు దొర్లుంటే స్పీకర్ ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు బుగ్గన. న్యాయ అన్యాయాలను నిర్దేశించే స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దారుణమన్న బుగ్గన, స్పీకర్ పిటిషన్ల తీవ్రతను పరిగణలోకి తీసుకోకుండా విషయాన్ని దాటవేస్తున్నారన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.

MLA Buggana fires on Kodeal and he said there is another reason for speaker rejecting the petitions

వైసీపీ పిటిషన్లు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని చెబుతున్న స్పీకర్, రెండు పార్టీలను సమన్వయ పరిచి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇలా మీడియా సమావేశాలు పెట్టి పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించడమేంటని నిలదీశారు.

పిటిషన్లను తిరస్కరించడం వెనుక అసలు కారణం వేరే ఉందని చెప్పుకొచ్చిన బుగ్గన.. ఫిరాయింపులకు సంబంధించి గతంలోనే వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో, ఈ నెల 8న దానిపై విచారణ జరగాల్సి ఉందని, సుప్రీం స్పీకర్ ను తప్పక ప్రశ్నించే అవకాశం ఉండడంతో, పిటిషన్ల తిరస్కరణకు తెర లేపారని ఆరోపించారు.

ఇలా ప్రతీ చిన్న విషయాన్ని అడ్డు పెట్టుకుని స్పీకర్ పిటిషన్లను తిరస్కరిస్తారన్న ఆలోచన తమకు ముందు నుంచే ఉందని, అందుకే అన్ని నిబంధనలను మరోసారి పరిశీలించి ఇంకో సెట్ అనర్హత పిటిషన్లను కూడా స్పీకర్ కు గతంలోనే అందజేశామన్నారు. కాబట్టి వాటి ఆధారంగానైనా స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Buggana Rajendranath Reddy made some interesting comments targeting speaker kodela shiva prasad. Adding to those comments he said 'there is another reason in rejecting those petitions

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి