ఏపీలో వరుణుడి బీభత్సం
Heavy rains: ఏపీని భారీ వర్షాలు వణికిస్తోన్నాయి. పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రత్యేకించి- ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటోంది. కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే నాగావళి, వంశధార నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి.
ఈ భారీ వర్షాల వల్ల వంశధార, నాగావళి నదులకు వరద ప్రవాహం పెరిగింది. అటు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నదికి వరద ఉధృతితో పోటెత్తుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నాగావళి కూడా వరద పెరిగే అవకాశం ఉన్నందున ఆయా నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
శుక్రవారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. తెల్లవారు జాము నుంచీ ఏకధాటిగా పడుతున్న వర్షం దెబ్బకు తిరుమల, తిరుపతి తడిచి ముద్దయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బస్టాండ్ లో వరదనీరు చేరుకుంది. తిరుచానూర్, రేణిగుంట, చంద్రగిరి వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. వరదనీటితో రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి.












Click it and Unblock the Notifications