అబ్బో.. సీఎం గారి బామ్మర్ది రాజకీయంలో పండిపోయాడే?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఏడాది పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. విష్ణు ప్రధాన హామీల్లో 'మా'కు సొంతంగా భవనం నిర్మించడం ఒకటి. అయితే సంవత్సరకాలం పూర్తవుతున్నా ఆ భవనం వ్యవహారం ఇంతవరకు అతీగతీ లేదు. ప్రస్తుతానికి ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ భవనంలో 'మా'కు కార్యాలయం ఉంది. అది కూడా కేవలం ఒక గది. అంతే.

ఫిలిం ఛాంబర్ కొత్త భవనంలో కొంటారా?
పెద్ద పెద్ద నటులంతా ఒకసారి కార్యాలయానికి రావాలన్నా ఆ గది సరిపోకవడంవల్లే సొంతంగా భవనం నిర్మించాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే విష్ణు ఈ సంవత్సర కాలంలో 'మా' భవనానికి సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ భవనాన్ని కూల్చేసి అక్కడ కొత్త భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఉంది.
కొత్తగా కట్టే భవనంలోనే 'మా' కోసం ప్రత్యేకంగా స్పేస్ కొంటానని, దీనికి సభ్యులంతా ఆమోద ముద్ర వేశారని చెబుతున్నారు. ఫిలిం ఛాంబర్ భవనాన్ని కూల్చేసి కొత్తది నిర్మించి, అది అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశం కనపడుతోంది.

'మా'మీద ఆధారపడి ఛాంబర్ లేదే!
ఛాంబర్ ఉన్న ప్రాంతమంతా కమర్షియల్ ప్రాంతం కావడంతో ఆ ప్రకారం నిర్మించుకున్నా ఛాంబర్ కు బోలెడంత ఆదాయం వస్తుంది. అంటే వాళ్లు ఎవరి డబ్బులపై ఆధారపడిలేరు అని అర్థమవుతోంది. అందులోను స్పేస్ కోసం 'మా' ఇచ్చే డబ్బులే వారికి ప్రధాన వనరు కాదని స్పష్టమవుతోంది. ఫిలింఛాంబర్ కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ కలిసి తీసుకుంటారు.
అలాగే 'మా' అధ్యక్షుడిగా విష్ణు చేసిన ప్రకటన సభ్యులను సంప్రదించి చేశాడా? లేదా? అనేది ప్రధానమైంది. అసలు ఫిలిం ఛాంబర్ సభ్యులను విష్ణు కలిసి మాట్లాడాడా? వాళ్ల అనుమతితోనే ఈ ప్రకటన చేశాడా? కొత్త భవనం కోసం విష్ణు ఛాంబర్ కు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు? లాంటివన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగిలిపోయాయి.

రాజకీయ నాయకుల్లానే..
ఎన్నికల సమయంలో 'మా'కు సొంత భవనం నిర్మించడం ఒక్కటే లక్ష్యంగా ఉండేది. ప్రచారంలో అదే ప్రధానంగా నిలిచింది. ఆ భవనంలోనే కల్యాణ మండపం, ఈత కొలను, అతిథుల కోసం గదులు, సమావేశ మందిరం తదితరాలుంటాయని పెద్ద చిట్టా విప్పారు. ఒకవేళ ఛాంబర్ లో విష్ణు స్పేస్ తీసుకుంటే ఇవన్నీ అందుబాటులోకి రావు. ఒక గదికి మరో మూడు గదులో, నాలుగు గదులో తోడవుతాయి అంతే. అందరు రాజకీయ నాయకుల్లానే 'మా' ఎన్నికల్లో విష్ణు వ్యవహరించాడని, నాయకులిచ్చినట్లుగా హామీలిచ్చాడని, దీనివల్ల 'మా'కు ఒరిగేదేమీ లేదని ఫిలింనగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications