Mudragada Padmanabham: జగన్ ను రావొద్దని చెప్పేశాం..! ముద్రగడ కుమారుడు గిరి వీడియో..!
ఏపీలో కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన్ను పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్టించుకోలేదంటూ ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ముఖ్యంగా తన తండ్రిని రాజకీయాలకు వాడుకుని, ఇప్పడు ఆస్పత్రిలో ఉంటే పరామర్శించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకునపెట్టాయి. ఆ తర్వాత వైసీపీ నేతలంతా ఆస్పత్రికి క్యూ కట్టారు. కానీ జగన్ మాత్రం వెళ్లలేదు. దీనిపై ఇవాళ ముద్రగడ కుమారుడు గిరి స్వయంగా వీడియో విడుదల చేశారు.
తన తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చేందుకు వీడియో విడుదల చేసిన ముద్రగడ గిరి.. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ముద్రగడ ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆస్పత్రి చైర్మన్ పార్ధసారధిరెడ్డితో కూడా మాట్లాడారని గిరి తెలిపారు. అలాగే ప్రతీ రోజూ తన తండ్రి విషయంలో ఫాలోఅప్ చేశారని గిరి తెలిపారు. అయితే ఆస్పత్రికి మాత్రం జగన్ రాకపోవడంపై స్పందించారు.

మా నాన్న గారు ముద్రగడ పద్మనాభం గారు నెమ్మదిగా కోలుకుంటున్నారు. జగన్ గారి ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి నాన్న గారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలబడిన జగన్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. pic.twitter.com/lwPoBtsieT
— Mudragada Giri (@giri_mudragada) July 1, 2026
తన తండ్రిని ఉంచిన ఐసీయూలోనే మరికొందరు రోగులు కూడా ఉన్నారని, అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో పరామర్శకు వచ్చేందుకు సిద్దమైన వైఎస్ జగన్ ను తామే వద్దని కోరినట్లు ముద్రగడ గిరి తెలిపారు. కావాలంటే ముద్రగడ కోలుకున్న తర్వాత తాము వచ్చి వైఎస్ జగన్ ను వచ్చి కలుస్తామని, లేదంటే కిర్లంపూడికి రావాలని జగన్ కు సూచించినట్లు ముద్రగడ కుమారుడు వెల్లడించారు. దీంతో జగన్ ఆస్పత్రికి రావాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు గిరి తెలిపారు. జగన్ అందించిన సహకారానికి ఆయనకు జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. దీంతో జగన్ ముద్రగడను పరామర్శించకపోవడం వెనుక ఉన్న కారణం స్పష్టమైంది.














Click it and Unblock the Notifications