జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అయింది. షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 14న షెడ్యూల్ విడుదల కానుంది. ఇటు కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మూడు పార్టీలు పోటీ చేసే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాల పైనా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డిసైడ్ అయ్యారు. ఈ సాయంత్రం భేటీ తరువాత తుది ఆమోద ముద్ర వేయనున్నారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. ఈ నెల 14న షెడ్యూల్ విడుదల చేసి.. మొత్తం 50 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. అందులో భాగంగా కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ సీట్ల విషయంలో దాదాపు అంగీకారం కుదిరింది. మొత్తం 17 మేయర్ స్థానాలు ఉండగా.. జనసేన నాలుగు స్థానాలు దక్కనున్నాయి. అందులో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ స్థానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. మరో సీటు ఏలూరు కేటాయిస్తారని తెలుస్తోంది. బీజేపీకి తిరుపతి స్థానం పైన చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ తిరుపతితో పాటుగా రాజమండ్రి కోరుతోంది. కాగా.. తిరుపతి మాత్రమే బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం.

నేడు జరిగే భేటీలో తుది కసరత్తు
అదే విధంగా మున్సిపాల్టీల కేటాయింపు పైనా చర్చలు జరుగుతున్నాయి. స్థానిక సమీకరణాలతో పాటుగా పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమావేశం కానున్నారు. వీరి భేటీలో కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, జెడ్పీ ఛైర్మన్లే, జెడ్పీటీసీ- ఎంపీటీసీల సర్దుబాటు పైన చర్చలు జరగనున్నాయి. మూడు పార్టీల ప్రతిపాదనలు.. అభ్యర్ధుల బలం ఆధారంగా ఈ మూడు పార్టీలు సీట్ల సర్దుబాటు పైన ఒక నిర్ణయానికి రానున్నాయి. జనసేన నాలుగు మేయర్ సీట్లు కోరుతున్నా... టీడీపీ విజయవాడ ఇవ్వటానికి అంగీకరించటంతో మూడు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా మున్సిపాల్టీల విషయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల తో పాటుగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కోరుతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ సాయంత్రం జరిగే భేటీలో మూడు పార్టీల సీట్ల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.













Click it and Unblock the Notifications
