మై నేమ్ ఈజ్ సుకుమార్.. బలంగా బ్రాండ్
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుకుమార్ శిష్యుల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. నెలల వ్యవధిలోనే ముగ్గురు సుకుమార్ అసిస్టెంట్లు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నారు. 2022 చివరలో అంచనాల్లేకుండా రిలీజైన '18 పేజెస్' డివైడ్ టాక్‌తోనే మంచి విజయం సాధించింది. ధియేటర్ల దగ్గర కూడా ఈ సినిమా విజయవంతమైంది. అనంతరం ఓటీటీలో విడుదలైతే అక్కడా మంచి స్పందన తెచ్చుకుంది. సుకుమారు ఎక్కువగా ఇష్టపడే దర్శకుల్లో ఒకరైన సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతకుముందు కూడా సుకుమార్ కథతోనే 'కుమారి 21 ఎఫ్' తీసి పెద్ద హిట్ కొట్టాడు.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన దసరా
గత నెల చివర్లో వచ్చిన నాని సినిమా 'దసరా' బాక్సాఫీస్‌ను ఊపేసింది. నాని కెరీర్ లో మొదటి రూ.100 కోట్ల చిత్రంగా నిలిచింది. శ్రీకాంత ఓదెల దీనికి దర్శకుడు. సుకుమార్ బ్రాండ్ ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు మరోసారి చాటిచెప్పినట్లైంది. మరో 3 వారాలకు సుకుమార్ మరో శిష్యుడు కార్తీక్ దండు మీదకు అందరి దృష్టి మళ్లింది. తాను రూపొందించిన తొలి చిత్రం 'విరూపాక్ష' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని సంవత్సరాల్లో తెలుగులో వచ్చిన బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా 'విరూపాక్ష' నిలిచింది.

విరూపాక్షతో మరో విజయం
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు అనుకూలంగా రావడంతో సాయంత్రానికల్లా థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కథ, టేకింగ్ ఈ సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి. ఎక్కడా బిగి సడలకుండా విరుపాక్షను కార్తీక్ తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను గెస్సింగ్ లో ఉంచడం.. తర్వాత ఎక్కడా ఆసక్తి కోల్పోకుండా చేయడంతోపాటు సినిమాలో ఉన్న స్టన్నింగ్ ట్విస్టులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
విరూపాక్ష సినిమాకు సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్ అయ్యింది. నాలుగు నెలల వ్యవధిలోనే దర్శకుడు సుకుమార్ శిష్యులు మూడో విజయాన్ని సాధించడంతో ఆయనమీద ప్రేక్షకులతోపాటు నిర్మాతల్లో కూడా అంచనాలు బాగా పెరిగిపోయాయి. పుష్ప-2 విడులకు ముందే సుకుమార్ ఒక బలమైన బ్రాండ్ గా రూపాంతరం చెందారు.












Click it and Unblock the Notifications