పులివెందులోనే ఎందుకిలా ? మీ ఏకగ్రీవాల సంగతేంటి? జగన్ కు లోకేష్ కౌంటర్..!
పులివెందులలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగిపోతున్నాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా ఖండించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవ విజయాలను ఎలా సాధించిందో చెప్పాలని ఆయన సవాలు విసిరారు. ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా అప్పట్లో ఎన్నికలు ఎలా జరిగాయో వివరించాలని సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం స్ధానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తోందని, ఎవరూ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం లేదని లోకేశ్ స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు పోలీసు రక్షణ కూడా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులే శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని, వాహనాలకు నిప్పు పెట్టడం, ప్రజలపై దాడులు చేయడం వంటి పనులు చేసి, ఆ నిందను టీడీపీపై వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చాపురం నుండి కుప్పం వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే, కేవలం పులివెందులలోనే ఎందుకు ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని లోకేశ్ ప్రశ్నించారు.

బెంగళూరు నుండి వచ్చి గొడవలు సృష్టించి, ఆపై తానే బాధితుడినని చెప్పుకుంటూ జాతీయ మీడియా ముందు జగన్ నాటకాలు ఆడుతున్నారని లోకేష్ విమర్శించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ, అనుమతించిన పరిమితులకు మించి రోడ్‌షోలు నిర్వహించి, ప్రజలతో మాట్లాడటం ద్వారా జగన్ నిబంధనలను అతిక్రమించారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద వినతిపత్రం సమర్పించేందుకు జగన్‌కు అవకాశం కల్పించినప్పటికీ, ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని లోకేశ్ పేర్కొన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఏకగ్రీవ విజయాల సమయంలో ప్రజాస్వామ్యం అస్సలు లేదని, కానీ ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
