తెలుగు రీ-రిలీజ్ సినిమాలపై నిషేధం..?!
నంద్యాల: టాలీవుడ్‌లో తెలుగు సినిమాల రీ- రిలీజ్ హవా నడుస్తోంది. 10 రోజులకు ఒకటి చొప్పున స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన, ఓ మోస్తరుగా ఆడిన సినిమాలన్నీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొస్తోన్నాయి. థియేటర్లల్లో సందడి చేస్తోన్నాయి.
పోకిరి, బిజినెస్‌మెన్, ఒక్కడు, సింహాద్రి, ఖుషీ, జల్సా, ఆరెంజ్, దేశముదురు, బిల్లా వంటి సినిమాలు రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకులను కట్టి పడేశాయి. తాజాగా ప్రభాస్ నటించిన యోగితో పాటు రఘువరన్ బీటెక్ సినిమాలు మళ్లీ విడుదల అయ్యాయి. గతంలో ఫ్లాప్ అయిన యోగి సినిమాను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.

రీ రిలీజ్ సమయంలో అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. పిచ్చపిచ్చగా రచ్చ చేస్తారు. బస్తాల కొద్దీ పేపర్లను తీసుకొచ్చి గాల్లో ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటారు. పాటలకు అనుగుణంగా కుర్చీలను ఎక్కి మరీ స్టెప్స్ వేస్తుంటారు. థియేటర్‌లోనే చిచ్చుబుడ్లను కాల్చడం, బాణాసంచాను పేల్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.
వారి అభిమానం అదుపు తప్పి అవాంఛనీయ సంఘటనలు సైతం చోటు చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. స్క్రీన్‌ను చించేయడం, కుర్చీలను విరిచేయడం, సీలింగ్ ఫ్యాన్లను ధ్వంసం చేయడం వంటివి సర్వసాధారణంగా మారాయి.. రీ రిలీజ్ చేసిన థియేటర్లల్లో. దీనికి అయ్యే నష్టం.. థియేటర్ యాజమాన్యం నెత్తిన అదనపు భారాన్ని మిగుల్చుతుంటుంది.
తాజాగా- నంద్యాలలో యోగి సినిమాను రీ రిలీజ్ చేసిన థియేటర్‌లో ప్రభాస్ అభిమానులు గందరగోళం సృష్టించారు. సినిమా ప్రదర్శితమౌతోన్న సమయంలో హఠాత్తుగా షో నిలిచిపోవడంతో వారు స్క్రీన్‌ను చించేశారు. అభిమానులు చేసిన పనికి రెండుచోట్ల స్క్రీన్ చినిగిపోయింది. కుర్చీలు భారీ సంఖ్యలో డ్యామేజ్ అయ్యాయి.
While celebrating the re-release of #Yogi Movie #Prabhas fans danced near the screen of Raj Theater and fell on the screen with enthusiasm and it was torn in two places and badly damaged. #Yogi4KReRelease #Yogi #Prabhas𓃵 #Nandyala #rajtheater pic.twitter.com/2PY2YdoAFj
— jeevan (@jeevan13470725) August 18, 2023
దీన్ని దృష్టిలో ఉంచుకుని నంద్యాల సినిమా ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై రీ రిలీజ్ సినిమాలను ప్రదర్శించకూడదని తీర్మానించారు. రీ రిలీజ్ చేయడం వల్ల వచ్చే ఆదాయం కంటే అభిమానులు చేసే డ్యామేజీకి అయ్యే ఖర్చు అధికంగా ఉంటోండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications