మార్షల్ ఆర్ట్స్ లో పవన్ అరుదైన ఘనత- జపాన్ లో ప్రతిష్ఠాత్మక అవార్డు
ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు. ప్రాచీన జపాన్ కత్తి యుద్ధకళ అయిన కెన్జుట్సులో ఆయనకు అధికారిక ప్రవేశం లభించింది. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మూడు దశాబ్దాలకుపైగా ఉన్న అనుభవం, ఇందులో చేసిన పరిశోధనలు, నిబద్ధతకు ఇది అద్దం పట్టింది. కెనిన్ కై ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఇన్ స్టిట్యూషన్ ఆయన ఈ గుర్తింపును ప్రదానం చేసింది.
ఈ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్ధిక్ మహమూదీ నుంచి గుర్తింపు పత్రాన్ని అందుకున్నారు. సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. చెన్నైలో తన బాల్యంలో కరాటే, ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందారు. ఇందులో టెక్నిక్ ను ఔపోసన పట్టారు. సాంకేతికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు. శారీరకంగా ఎన్నో అడ్డంకులను అధిగమించారు. జపాన్ సమురాయ్ యుద్ధ సంప్రదాయాలపై పరిశోధన చేశారు.

ఆయన యుద్ధ కళల పరిజ్ఞానం సినిమాల్లోనూ ప్రతిబింబించింది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', 'తమ్ముడు', 'ఖుషి', 'అన్నవరం', 'ఓజీ' చిత్రాల్లో యుద్ధ కళలను ప్రదర్శించారు. జపనీస్ సినిమాలకే పరిమితమైన మార్షల్ ఆర్ట్స్ ను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన మొట్టమొదటి హీరో ఆయనే. దీనివల్ల ఈ కళలకు అవగాహన, ఆదరణ పెరిగాయి. ప్రత్యేకించి- తమ్ముడు సినిమాలో బాక్సింగ్ లో శిక్షణ పొందే సన్నివేశాల్లో ఆయన నిజంగానే మార్షల్ ఆర్ట్స్ ను ప్రదర్శించారు.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌కు చేసిన అంకితభావానికి అనేక చారిత్రక గౌరవాలు దక్కాయి. సాంప్రదాయ జపాన్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థ 'సోగో బుడో కన్రి కై' నుండి ప్రతిష్టాత్మకమైన అయిదో డాన్ అందుకున్న మొట్ట మొదటి భారతీయ సినీ ప్రముఖుడు పవన్ కల్యాణే. జపాన్ వెలుపల సోకే మురమాట్సు సెన్సాయి ఆధ్వర్యంలోని 'తకేడా షింగెన్ వంశం'లోకి ప్రవేశించిన తొలి భారతీయుడు కూేడా ఆయనే. ఈ గౌరవం జపానేతరులైన దక్కడం చాలా అరుదు.
'గోల్డెన్ డ్రాగన్స్' సంస్థ పవన్ కళ్యాణ్‌కు "టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే బిరుదుతో సత్కరించింది. ఈ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తొలి భారతీయ సెలబ్రిటీ ఆయనే. భారత ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూది వద్ద పవన్ కళ్యాణ్ కెండో అంశాలను అభ్యసించారు. ఆయన మార్గదర్శకత్వంలో కెండోలో పూర్తి శిక్షణతో ఉన్నత సాంకేతిక నైపుణ్యంలో మెళకువలను నేర్చుకున్నారు. శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తాత్వికతలను అందుకున్న కొద్దిమంది భారతీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచారు.












Click it and Unblock the Notifications