నా సినిమా విడుదలైతే వస్తారు కానీ, పింఛన్లు ఇవ్వడానికే ఉద్యోగులు లేరా?: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లను ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద సిబ్బందే లేరా? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన సినిమా విడుదలైదే థియేటర్ల వద్దకు ఉద్యోగులను పంపిస్తారు కానీ.. పింఛన్లు ఇంటి వద్ద ఇచ్చేందుకు ఎందుకు లేరని నిలదీశారు. పింఛన్లు తీసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన ముగ్గురు వృద్ధులు బుధవారం వివిధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. 'ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?' అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా నిలదీశారు.

'కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి' అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంతేగాక, తన సినిమా బీమ్లా నాయక్ విడుదలైన సమయంలో థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారులను రేట్లు పర్యవేక్షించేందుకు నియమించిన ఉత్తర్వులను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
కాగా, ఇంటి వద్దకు వచ్చే పింఛన్లు టీడీపీ, జనసేన వల్లే ఆగిపోయాయని అధికార వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వృద్ధులు సచివాలయాలకు వచ్చి ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండతీవ్రత, వడదె్బ తగిలి ఏపీ వ్యాప్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ, జనసేన కారణంగానే పింఛన్లు ఇంటికి అందించే అవకాశం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో పింఛను అంశం హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications