ఇప్పుడంతా కోడిగుడ్డే: మంత్రి అమర్నాథ్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లు
అనకాపల్లి: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది. కానీ, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలంపాటు పార్టీని నడపడం అంత సులభం కాదు. అయినా సరే మీ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్లినా తనకు అశేష ప్రజాభిమానం ఉందన్నారు. ఇంత ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుందన్నారు. కానీ, స్వార్థాన్ని దాటి మీకోసం వచ్చానని తెలిపారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదన్నారు పవన్ కళ్యాణ్. అన్ని శక్తులు కలవాలన్నారు. అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నామని పవన్ వివరించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేనది అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చిందన్నారు.
అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు. ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమో తనకు తెలుసన్నారు. సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడూ వింటాం, ఈ మధ్య అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం!#VarahiVijayaBheri#VoteForGlass#Anakapalli pic.twitter.com/iQeW8v9vPk
— JanaSena Party (@JanaSenaParty) April 7, 2024
మంత్రి అమర్నాథ్ పై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది. వైసీపీ కోడి. ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్ ను ఇచ్చింది. కానీ, ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయింది అంటూ మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి పవన్ సెటైర్లు వేశారు. మరోవైపు, జగన్ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీ దారు అని పవన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications