పవన్ కళ్యాణ్ మళ్లీ కేసీఆర్‌ను ఢీకొంటారా?, స్ఫూర్తి విగ్రహం!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించడం లేదనే చెప్పవచ్చు. అయితే, పవన్ తన సినిమాలను పూర్తి చేశాక పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగదేశం, భారతీయ జనతా పార్టీల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, సినిమాలలో బీజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ పైన ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారని అంటున్నారు. దీంతో, త్వరలో సినిమాలు పూర్తి చేసి జనసేన పైన దృష్టి సారిస్తారా అనే ప్రశ్న అందర్నీ తొలుస్తోంది.
అలా కాకపోయినా, గ్రేటర్ ఎన్నికల్లో ఎంతో దూరంలో లేనందున.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలబడినట్లే, గ్రేటర్ ఎన్నికల్లోను ఆ పార్టీలకు అండగా నిలబడతారా? లేక ఆ పార్టీలతో కలిసి పోటీ చేస్తారా? అనే చర్చ సాగుతోంది. పార్టీ పైన ఇప్పటి వరకు ప్రత్యేకంగా దృష్టి సారించనందున ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవని చెబుతున్నారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన పైన పవన్‌కు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబు, మోడీల పైన ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీకి అవసరమైనప్పుడు అంటే గ్రేటర్ ఎన్నికల్లో మద్దతివ్వడం లేదా కలిసి పోటీ చేయడం జరగవచ్చునని చెబుతున్నారు.
తద్వారా పవన్ మరోసారి కేసీఆర్ పైన తనదైన శైలిలోల వాగ్భాణాలు ఎక్కు పెడతారా, కేసీఆర్ పాలన పైన, మజ్లిస్ పార్టీతో తెరాస దోస్తీ పైన ఏమంటారో అనే చర్చ సాగుతోంది. పవన్ ప్రస్తుతానికి దూరంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదనే వారు ఉన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ అభిమాని చందు ఓ విగ్రహాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కురణాకర్ వాడేయర్ అనే ప్రముఖ శిల్పి తాడేపల్లిగూడంలో ఈ విగ్రహం రూపొందిస్తున్నారు. ఈ విగ్రహం ఏడున్నర అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ విగ్రహం ద్వారా పవన్ ఇచ్చే సందేశం మరింతగా జనాల్లోకి వెళ్తుందని చందు చెబుతున్నారు. పవన్ అందరికీ స్ఫూర్తి అన్నారు.












Click it and Unblock the Notifications