కీలక నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ పై పవన్ వేటు..!!
మున్సిపల్ ఎన్నికల వేళ జనసేనాని పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నిక ల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఇక.. పొత్తుల్లో పార్టీలకు కేటాయించిన సీట్లతో పాటుగా కూటమి పార్టీల అభ్యర్ధులు పలు చోట్ల నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో.. ఖరారు చేసిన అభ్యర్ధులు మాత్రమే పోటీలో ఉండేలా.. మిగిలిన వారితో విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్ పైన పవన్ వేటు వేయటం సంచలనంగా మారుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి ప్రస్తుత ఇన్‌ఛార్జ్ రాజాన సూర్యచంద్రను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తక్షణమే తప్పించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో విఫలమవ్వడం, కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించడం వంటి అంశాలపై కేంద్ర కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు అందాయి. క్యాడర్ నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను గమనించిన అధిష్టానం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. స్థానిక నాయకుల నుంచి అందిన సమాచారం ఆధారంగా పవన్ కళ్యాణ్ ఈ మార్పులు చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ పటిష్టత కోసం ఈ కీలక చర్యలు చేపట్టడం జరిగిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పార్టీ నేతలకు అదనపు బాధ్యతలు
తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన అధిష్టానం నర్సీపట్నం నియోజకవర్గ నూతన సమన్వయ బాధ్యతలను ఇద్దరు అనుభవజ్ఞులైన సీనియర్ ఎమ్మెల్యేలకు అప్పగించింది. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం అదనపు బాధ్యతలు దక్కాయి. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇకపై స్థానిక వ్యవహారాలను పూర్తిగా పర్యవేక్షించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తోందని జిల్లా నేతలు వెల్లడించారు. ఈ ఆకస్మిక మార్పుతో నర్సీపట్నం నియోజకవర్గ జనసేనలో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.













Click it and Unblock the Notifications
