తిరుపతిలో ఇంకాస్సేపట్లో టీటీడీ భారీ కార్యక్రమం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. గురువారం నాడు 78,026 మంది భక్తులు స్వామివారిని దర్శించారు. వారిలో 31,166 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.21 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 3.13 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 2,962 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు.

కాగా.. నేడు తిరుపతిలో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది టీటీడీ. పిండి దీప మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉదయం 7:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీటీడీ జేఈవో ప్రభల గోపీనాథ్ ఈ ఏర్పాట్లను ఇదివరకే పర్యవేక్షించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నాయి.
ఈ పిండి దీప మహోత్సవం సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ గ్రౌండ్ నుంచి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద నామస్మరణతో పాదయాత్ర సాగనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు ఇందులో. వారికి తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచింది టీటీడీ. పిండి దీపంలో నెయ్యితో జ్యోతిని వెలిగించి, గోవిందుడి నామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ మహోత్సవ ప్రత్యేకత.
అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించడం, భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, సనాతన ధర్మ వైభవాన్ని భావితరాలకు అందించాలని జేఈవో ప్రభల గోపీనాథ్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు టీటీడీ పరిపాలన భవనం పరేడ్ గ్రౌండ్, అలిపిరి పాదాల మండపం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.














Click it and Unblock the Notifications
