మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ, మరో 70 మందిపై ఎఫ్ఐఆర్
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. రాయలసీమలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటోన్నాయి. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలల్లో అధికార తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణలు పతాకస్థాయికి చేరాయి. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగడం, ఆ వెంటనే రాయచోటిలో వాహనాలు తగలబడటం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పులివెందుల, రాజంపేటల్లో ఇదే పరిస్థితి తలెత్తింది.
ఈ నెల 16న మిథున్ రెడ్డి.. పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు ఈ వివాదం మొదలైంది. ఆయనను అడ్డుకోవడానికి టీడీపీ క్యాడర్ ప్రయత్నించింది. దీంతో రెండు పార్టీల నాయకులు, కార్యర్తల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకుంది. కాన్వాయ్ పై టీడీపీ నాయకులు రాళ్లు విసరడంతో మిథున్ రెడ్డితో పాటు ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

ఈ హింసాత్మక ఘర్షణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ ఘటనలకు సంబంధించి రాజంపేట వైసీపీ లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నామినేషన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న గొడవలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ పెట్టారు.
ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో కూడా మిథున్ రెడ్డి పేరు చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీకే చెందిన చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగభూషణం పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. టీడీపీ నాయకులు జంపాల మోహన్ నాయుడు, ఎస్ మధుసూదన రాయల్ పై దాడులు చేసినట్లు వీటిల్లో పొందుపరిచారు.
రాష్ట్ర ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కూడా మిథున్ రెడ్డి, రెడ్డెప్పపై కేసులు నమోదయ్యాయి. వారందరిపైనా బీఎన్ఎస్ లోని సెక్షన్లు 109 (1), 115 (2), 118 (1), 189 (2), 191 (2)/(3), 190, 351 (2), 324 (4) కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, దాడుల వెనుక గల కారణాలను వెలికి తీయడానికి పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. గొడవల్లో ఎవరెవరి ప్రమేయం ఉందో నిర్ధారించడానికి నామినేషన్ కేంద్రం పరిసరాల్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ, సోషల్ మీడియా వీడియోలను విశ్లేషిస్తోన్నారు.
ఎన్నికల సమయంలో అల్లర్లను ప్రోత్సహించిన వారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. పుంగనూరులో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసు బలగాలను మోహరించారు. ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోన్నారు. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.













Click it and Unblock the Notifications
