చంద్రబాబుకు సవాల్ విసురుతున్న వర్మ- అరెస్టు కష్టమేనా? అందుకేనా ఇంటర్వ్యూలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ అండతో విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై వ్యక్తిగతంగా ట్వీట్లతో విరుచుకుపడిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని అంతా భావించారు. ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో ఇదే అంశంపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఓసారి, మొత్తం కేసులు కొట్టేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఆయన్ను అరెస్టు చేయలేదు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని హైదారాబాద్ లోని ఇంటికి వెళ్లి మరీ రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం రాకుండా తప్పించుకోవడమే కాకుండా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడా ఆయనకు తక్షణ ఊరట లభించకపోవడంతో అరెస్టు తప్పదని అంతా భావించారు. పోలీసులు కూడా వర్మ కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే అదంతా ఒట్టిదే అనిపించేలా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వర్మ కోసం ముమ్మర గాలింపు కొనసాగుతుందని భావించినా అదంతా ఒట్టిదేనని అర్ధమైపోయింది. ఎందుకంటే తాను ఎక్కడికీ పారిపోలేదని, తన డెన్ లోనే ఉన్నానని వీడియోలు రిలీజ్ చేస్తున్న వర్మ.. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా టీవీ ఛానళ్ల ఆఫీసులకు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వర్మకు ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు టీవీ ఛానళ్లు ఆయన్ను వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నా పోలీసులు మాత్రం కనీసం వాటిని ఆపే పరిస్దితిలో కూడా లేరు. దీంతో వర్మ అప్పట్లో తాను పెట్టిన ట్వీట్లు కామెడీ అంటూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
మరోవైపు హైకోర్టులో వర్మ బెయిల్, క్వాష్ పిటిషన్ల వ్యవహారం ఇంకా తేలడం లేదు. ఇవాళ హైకోర్టులో మరోసారి ఈ అంశం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో పెండింగ్ ఉన్న కేసులో వర్మను అరెస్టు చేస్తే విమర్శలు ఎదురవుతాయన్న భయంతో పోలీసులు వెనక్కి తగ్గుతుంటే.. దాన్ని సొమ్ముచేసుకుంటే అదే కోర్టులో ఉన్న కేసులపై వర్మ బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.












Click it and Unblock the Notifications