కంచుకోటలో టీడీపీ ఆశల పై రెబల్ నీళ్లు..!!
ఈ సారి అధికారం టీడీపీకి వన్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారింది. బీజేపీ, జనసేనతో జత కట్టి చివరి నిమిషం వరకు పోరాడింది. పోలింగ్ శాతం పెరగటంతో భారీ ఆశలు పెట్టుకుంది. అటు జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. ఓటింగ్ సరళి నియోజకవర్గాల వారీగా పరిశీలించిన నేతలకు కీలక నియోజకవర్గాల్లో కీలక అంశాలు సమస్యగా మారుతున్నాయి. టీడీపీ గెలుపు ఖాయమని భావించిన సెగ్మెంట్లలో రెబల్స్ దెబ్బ తీసినట్లు గుర్తించారు.
టీడీపీ రెబల్ పోటీ
విజయనగరం అసెంబ్లీ సీటు గెలుపు పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. స్థానికంగా సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేసింది. అయితే, టిడిపి, వైసిపి అభ్యర్థులు మాత్రమే ఎన్నికల పోటీలో ఉంటే ఈ సారి మాత్రం టిడిపిలో టిక్కెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.

దీంతో ఈ ఎన్నికలు త్రిముఖంగా మారాయి. పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ నియోజకవర్గానికి టిడిపి తరపున సుధీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతి రాజు టీడీపీ అభ్యర్దిగా బరిలో నిలిచారు. టీడీపీ సీటు ఆశించి భంగపడిన మీసాల గీత స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసారు.
త్రిముఖ పోటీ
2014 ఎన్నికల్లో టిడిపి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గీత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు. వైసిపి నుండి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. కోలగట్ల స్థానికంగా బలమైన నేత.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కోలగట్ల ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు.
కోలగట్ల ఇక్కడ రాజుల కుటుంబంతో దశాబ్దాలుగా పోటీ పడుతూనే ఉన్నారు. స్థానికంగా తాను చేసిన పనులు.. జగన్ సంక్షేమ ఓట్ బ్యాంక్ తనకు కలిసి వస్తుందని కొలగట్ల లెక్కలు వేస్తున్నారు.
గెలుపు దక్కేదెవరికి
విజయనగరంలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలం అని రెండు ప్రధాన పార్టీలు అంచనా వేస్తుంటే సైలెంట్ ఓటింగ్ అంతా తనదే అని అంటున్నారు స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత.
అయితే గీతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ టిడిపిపైన పడే అవకాశాలు ఉన్నాయి. లేక నామమాత్రంగా పోటీలో ఉంటే టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే లెక్కలపై కొలగట్ల ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. త్రిముఖ పోటీలో ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పంగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..విజయనగరం ఫలితం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications