ఏపీలోనే ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ తయారీ..! డెడ్ లైన్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త బ్రాండ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ప్రీమియం మోటార్ బైక్ ల బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) తమ బుల్లెట్ మోటార్ సైకిల్ ను రాష్ట్రంలోనే తయారు చేసేందుకు వీలుగా ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి జిల్లాలోని సత్యవేడు వద్ద ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) వద్ద కీలక చర్చలు జరిగాయి. అనంతరం కీలక ప్రకటన వెలువడింది.
బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రతినిధులతో చర్చల్లో స్పష్టం చేశారు. తిరుపతి సమీపంలో ఏర్పాటు చేసే రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ కు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పించటంపై సంస్థ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుందని వారు తెలిపారు. అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్ కూడా నిర్మిస్తామన్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్టు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ సీఎంకు వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. అనంతరం రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్‌ను ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా బుల్లెట్ 350 మోటార్ సైకిళ్లకు సంబంధించిన మోడళ్లను సీఎం పరిశీలించారు. హెల్మెట్ ధరించి సీఎం బుల్లెట్ ఎక్కి కాసేపు ఫొటోలకు ఫోజులిచ్చారు.














Click it and Unblock the Notifications