పొత్తుల ఖరారు వేళ - వైసీపీకి ప్రజా మద్దతు ఎంత, ఇదీ లెక్క..!!
ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత వస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. జనసేనాని పవన్ టీడీపీతో పొత్తు పైన తేల్చి చెప్పారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు.బీజేపీని ఆహ్వానించారు. తమతో కలిసి రావాలని కోరారు. బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో సింగిల్ గా పోటీకి సిద్దం అవుతున్న వైసీపీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. దీని వెనుక పర్జా మద్దతు ఎంత అనే లెక్కలు తెర మీదకు వచ్చాయి.
వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని పవన్ పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పుకొచ్చారు. అయితే, అధికార వైసీపీ తమ ధీమా వెను కారణం ఏంటో స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు వ్యతిరేక ఓటు కంటే పాజిటివ్ ఓటు ఎక్కువగా ఉందని తేల్చి చెబుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారు తరువాత ఇదే అంశం పైన వైసీపీ నేత సజ్జల స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని చెప్పారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారని ఎద్దేవా చేశారు. 2009లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేశారన్నారు. 2014లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి విడిగా పోటీ చేశారన్నారు. ఇప్పుడు కలిశామంటున్నారు గానీ అసలు విడిపోయిందెప్పుడని సజ్జల ప్రశ్నించారు.

వైసీపీకి 75 శాతం పైగా మద్దతు ఉందని...రకరకాల ఫ్యాక్టర్లు వచ్చే ఎన్నికల్లో పని చేసినా తమకు ఈసారి 60 శాతం ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. ఇంకా తగ్గినా 53 శాతం ఖాయమనే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తం అయింది. గతంలో ఏ ప్రభుత్వానికి ఈ స్థాయిలో మద్దతు రాలేదన్నారు. అన్ని సర్వేలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని సజ్జల వెల్లడించారు. పవన్ మేకపోతు గాంభీర్యం మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
స్కిల్ స్కాంలో రూ.350 కోట్లు బయటకు వెళ్లాయన్నారు. సీమెన్స్ కంపెనీ మాకు డబ్బు రాలేదని చెప్పిందని గుర్తు చేసారు. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలిందని చెప్పారు. ఇక అవినీతి జరగలేదని అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. సీమెన్స్‌కు తెలియకుండానే డబ్బులు వెళ్లాయని, అసలు ఒప్పందంలో రూ.3,300 కోట్లు అనేదే లేదన్నారు. జీవోలో ఒకలాగ, ఒప్పందంలో ఒకలాగ రాసుకున్నారని వివరించారు. అమరావతి స్కాం, స్కిల్ స్కాం అన్ని బయటకు వస్తాయన్నారు. అడ్డంగా చేసిన తప్పులకు ఆధారాలు ఉన్నాయి అని సజ్జల పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications